జస్టిన్ ట్రూడో, పీటర్ నవరో (పాత చిత్రం)
వాషింగ్టన్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకుగానూ వైట్‌హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో క్షమాపణలు కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ట్రూడోను ఉద్దేశించి ‘నరకంలో మీకు ప్రత్యేక చోటు’ ఉంటుందని వ్యాఖ్యానించినట్లు ఒప్పుకున్నారు. స్థానిక మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాలను వెల్లడించింది. ‘ఇటీవల జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా ఉద్దేశాన్ని స్పష్టంగా తెలపాలనుకున్నా. కానీ నేను ఉపయోగించిన భాష సరైంది కాదని’ పీటర్ నవరో వివరణ ఇచ్చుకున్నారు
‘కెనడాతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అమెరికా - కెనడాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతాయి. దౌత్య సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటుండదు. పరిశ్రమలు, సంస్థలు, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని’ ట్రేడ్ మినిస్టర్ ఫ్రాన్సిస్ ఫిలిప్ అన్నారు. వైట్‌హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ లారీ కుడ్లో కూడా కెనడా ప్రధాని ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, ఇటీవల జీ–7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే.‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి పచ్చి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్ (పన్ను)లు ఎక్కువగా ఉన్నాయని’ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment