
యశ్వంతపుర : సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’పై కన్నడనాట నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కావేరి జలాల విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ తెలిపారు. కర్ణాటకవాడైన రజనీకాంత్ సొంత రాష్ట్రమని కూడా మమకారం చూపకుండా కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం సమంజసం కాదన్నారు. శనివారం నాగరాజు ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. కాలా సినిమాను విడుదల చేసే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. రజనీకాంత్ సినిమాలతో పాటు కమల్‌హాసన్ సినిమాలను కూడా అడ్డుకొంటామని ఆయన చెప్పారు. పలు కన్నడసంఘాలు కూడా కాలాను అడ్డుకుంటామని శనివారం ప్రకటించాయి.