
హుబ్లీ: కర్ణాటక హూబ్లీలోని విశ్వనాథ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో ఒక మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. పక్కన ఉన్న కొవ్వొత్తి వల్ల ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 17న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రురాలి పేరు ఛాయ అని తెలుస్తోంది. ఇక్కడి కిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
ఆమె చీరకు మంటలు అంటుకోవడంతో, దీంతో భయభ్రాంతులకు గురైన మహిళ సాయం కోసం అర్థించడం ఇదంతా ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదైంది. మంటలు అంటుకొని ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు పరిగెత్తుకొని వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కోల్‌కతాలోని కారుణ్యమయి కాళీ ఆలయంలో ఓ 50 ఏళ్ల మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. ఆమె చీరకు ఇదేవిధంగా మంటలు అంటుకొని.. గాయాలు అయ్యాయి. దీంతో ఆలయంలో కొవ్వొత్తులు, అగరవొత్తులు వంటివి నిషేధించారు.