ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు, అదేక్రమంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు పెట్టి డెలివరీలు చేయించుకునే పెద్ద కష్టం నుంచి పేదలు, మధ్యతరగతి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కొత్తగా 102 పేరిట వాహనాలను ప్రవేశపెట్టింది. ఒక్కో నియోజకవర్గానికి రెండేసి చొప్పున మొత్తం 10 వాహనాలను కేటాయించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచడం, సాధారణ డెలివరీలను పోత్సహించడం, శిశు మరణాలు తగ్గించడం..అనేది వీటి వినియోగ ముఖ్య ఉద్దేశం. ఒక్కో వాహనానికి రూ.8 లక్షలు వెచ్చించారు. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు.
అమ్మఒడికి చేయూత..
గతేడాది జూన్ 3వ తేదీన ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.2వేల విలువైన 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లు అందజేస్తూ, నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మగబిడ్డ పుడితే రూ.12,000, ఆడబిడ్డ అయితే రూ.13,000 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుండడంతో సర్కారు ఆస్పత్రుల్లో బాగా చేరుతున్నారు. గతంలో ఏడాదికి కేవలం 5వేల డెలివరీలు మాత్రమే జరగ్గా..అమ్మఒడి పథకం వచ్చాక సంవత్సరానికి 11వేల ప్రసవాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పథకం తొలిదశలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్‌సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 224 సబ్‌సెంటర్ల పరిధిలో గర్భిణులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవడం విశేషం.
నియోజకవర్గానికి రెండు..
ఇప్పటికే 102 వాహనాలు జిల్లాకు చేరాయి. నియోజకవర్గానికి రెండు చొప్పున సేవలు అందించనున్నాయి. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా సేకరించే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాల ప్రకారం ఆయా ప్రాంతాలకు 102 వాహనం వెళ్లి వారిని ఆస్పత్రులకు చేరవేస్తుంది. వైద్యం చేయించుకున్నాక..తిరిగి వారి ఇళ్ల వద్ద క్షేమంగా దింపుతుంది. ఒక్కో వాహనం ద్వారా 10 మందిని తరలించే అవకాశం ఉంటుంది.
వారంలో రోడ్డుపైకి..
ప్రభుత్వం ఖమ్మంజిల్లాకు 10 వాహనాలు కేటాయించింది. వారంలో 102 వాహనాలు రోడ్డు ఎక్కనున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది. అత్యవసర సేవలు 108 ద్వారా, ప్రణాళికా బద్ధంగా 102 ద్వారా సేవలు అందనున్నాయి. – నజీరుద్దీన్, 108 జిల్లా కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment