హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం | Another blockbuster would Havish says Dasari Kiran Kumar | Sakshi
Sakshi News home page

హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం

Published Sun, Feb 8 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం

హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం

- దాసరి కిరణ్‌కుమార్
 ‘‘ఈ చిత్రనిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నాకు చిరంజీవిగారి అభిమానిగా పరిచయం. ఎంతో కష్టపడి ఆయన నిర్మాతగా మారారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చిన్నా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు.
 
 ప్రచార చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆవిష్కరించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఓ చక్కని కథతో శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాసరి కిరణ్ రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితానివ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. కిరణ్‌కుమార్ మంచి చిత్రాలు తీయాలనే తపన ఉన్న నిర్మాత అని బి. గోపాల్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘మా విశ్వ విద్యాలయాన్ని హవీష్ బాగా చూసుకునేవాడు. సినిమాలంటే తనకు ఆసక్తి కావడంతో ప్రోత్సహించాం. వాస్తవానికి ‘జీనియస్’కన్నా ముందు చేయాల్సిన చిత్రం ఇది’’ అన్నారు.
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రం ‘జీనియస్’ని మించిన విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది. హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. చక్కని అవగాహనతో దర్శకుడు ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని హవీష్ అన్నారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకోవాలని ఎస్. గోపాల్‌రెడ్డి, చిన్నా అభిలషించారు. ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, విస్సు, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement