సమ్‌థింగ్ స్పెషల్ ఇయర్!
మరి మూడు రోజుల్లో 2015కు సెలవు చెప్పేస్తున్నాం. ఈ ఏడాది కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుంటే, తెలుగు తెరపై కొన్ని తీపి గుర్తులు, మరికొన్ని చేదు మరకలు ఉన్నాయి. ఎన్ని సినిమాలొచ్చాయి, ఎవరెన్ని సినిమాల్లో చేశారు లాంటి కథ కాసేపు పక్కనపెడితే, చరిత్రలో నిలిచిపోయే కొన్ని విశేషాలు, విషాదాలు, ఫస్ట్‌టైమ్ రికార్డులకు ఈ 2015 సాక్షి. అలాంటి కబుర్లు కొన్నింటి ఫ్లాష్‌బ్యాక్...
♦ 2015 బాక్సాఫీస్ గలగలలకు ఓ అనువాద చిత్రం శుభారంభం పలికింది. ధనుష్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘రఘువరన్ బీటెక్ ’ ఘనవిజయం సాధించింది. కమలహాసన్ ‘నాయకుడు’ తర్వాత నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ డబ్ చేసిన సినిమా ఇదే.
♦ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాలో గెస్ట్‌గా కనిపించారు. చిత్రం పేరు ‘మన కుర్రాళ్లే’. వీరశంకర్ దర్శకత్వం వహించారు.
♦ {పముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల ఆధారంగా ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు రూపొందడం విశేషం. ‘శ్యాంగోపాల్ వర్మ’ చిత్రానికి ‘మిస్టర్ నో’ నవల ఆధారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ జ్యోతిలక్ష్మి ’కి ‘మిసెస్ పరాంకుశం’ నవల బేస్. వంశీ 25వ సినిమా ‘వెన్నెల్లో హాయ్ హాయ్’కి మల్లాది నవల ‘మేఘమాల’ ఆధారం. ఆ సినిమా కూడా నిజానికి ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆలస్యమైంది.
♦ మీడియాకు చాలా దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఈ ఏడాది జనవరి 1న ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే 91 వేల పైచిలుకు మంది ఈ ఖాతాను అనుసరించడం విశేషం.
♦ ఈ 2015 - తెలుగు సినిమాకు చాలా ద్రోహమే చేసింది. హేమాహేమీలను తనలో కలిపేసుకుంది. ముఖ్యంగా టాప్ కమెడియన్లను తన వెంట తీసుకుపోయి ప్రేక్షకులకు బోలెడంత విషాదాన్ని మిగిల్చింది. నటులు ‘ఆహుతి’ ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, మాడా, కొండవలస, రంగనాథ్, ‘కళ్లు’ చిదంబరం, మనోరమ, నిర్మాతలు డి. రామానాయుడు, వీబీ రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు, అట్లూరి రామారావు, సాంకేతిక నిపుణులు విన్సెంట్, శ్రీ, డీటీఎస్ మధుసూదన్ రెడ్డి, ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు వి. రామకృష్ణ, రచయితలు గణేశ్‌పాత్రో, సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, కాశీ విశ్వనాథ్ తదితరులు దివంగతులయ్యారు.
♦ తలుచుకుంటే తెలుగులోనూ మల్టీస్టారర్లు మళ్ళీ సాధ్యమేనని ‘గోపాల గోపాల’ నిరూపించింది. హిందీ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో ఇది రూపొందింది. హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కనిపించిన తొలి తెలుగు సినిమా ఇదే.
♦ ‘ఈ’ టీవీ, జెమినీ టీవీ కలసి సంయుక్తంగా ‘ బీరువా’ అనే సినిమా నిర్మించాయి. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేశారు.
♦ ఈ ఏడాది రీమిక్స్ సాంగ్స్ బాగానే వచ్చాయి. బాలకృష్ణ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లోని ‘అరె ఓ సాంబా...’ పాటను కల్యాణ్‌రామ్ ‘పటాస్’ కోసం రీమిక్స్ చేశారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 786’లోని ‘ గువ్వా గోరింకతో ’ పాటను ‘ సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో రీమిక్స్ చేశారు.
♦ నటుడు కోట శ్రీనివాసరావు ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు.
♦ తమిళ ‘సూదు కవ్వమ్’కు రీమేక్‌గా రూపొందిన రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’లో సంగీత దర్శకుడు అచ్చు మెయిన్ రోల్ చేశారు.
♦ ఎప్పుడూ సొంత కథలతోనే సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ తొలిసారిగా బయటివాళ్ల కథతో ‘టెంపర్’ చేశారు. వక్కంతం వంశీ రచయిత. ఓ సీన్‌లో పూరీ యాక్ట్ చేశారు.
♦ నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ లో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ పాటలో ముస్లిమ్ గెటప్‌లో షాయిరీ పాడుతూ నటించారు. కమలహాసన్ చాలా కాలం తరువాత తెలుగు, తమిళాల్లో ఏకకాలంలో తీసిన ‘చీకటి రాజ్యం’లో రచయిత అబ్బూరి రవితో కలసి కాసేపు తెరపై పాత్రల్లో మెరిశారు.
♦ ‘సచిన్’ (‘టెండూల్కర్ కాదు’ క్యాప్షన్) చిత్రంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ లీడ్ రోల్ చేశారు.
♦ హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలు ఒకే రోజు (మార్చి 21) విడుదల కావడం విశేషం. ‘ఎవడే సుబ్రమణ ్యం’లో కృష్ణంరాజు, ‘షావుకారు’ జానకి, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్ తారలు చాలాకాలం తర్వాత తెరపై కనిపించారు.
♦ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఏడు కథలతో తీసిన ‘చందమామ కథలు’ జాతీయ స్థాయిలో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది.
♦ దర్శక-నిర్మాత వై.వి.ఎస్. చౌదరి సారథ్యంలో సుమారు నాలుగేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘రేయ్ ’ ఈ ఏడాది విడుదలైంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తే జ్‌కి హీరోగా ఇదే తొలి చిత్రం. అయితే దీని కన్నా ముందే ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఇదే ఏడాది విడుదలైంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ హిందీ చిత్రంలో ఎండ్ టైటిల్స్‌లో రజనీకాంత్‌పై స్పెషల్ సాంగ్ వచ్చినట్లే, ఇందులో పవన్ కల్యాణ్‌పై ‘పవనిజం’ సాంగ్ చేశారు. వై.వి.ఎస్. ‘దేవదాస్’ ద్వారా పరిచయమైన హీరో రామ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
♦ నిర్మాణం నుంచి ప్రదర్శన దాకా అన్నీ డిజిటల్‌మయమైపోయిన ఈ రోజుల్లో ‘జిల్’, ‘రేయ్’ చిత్రాలను కొంత ఫిల్మ్ నెగిటివ్‌లో షూట్ చేసి, తీశారు. తెలుగులో నెగిటివ్‌ను చిత్రీకరణకు ఉపయోగించిన ఆఖరి సినిమాలు ఇవే.
♦ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌తో మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’ తెలుగు వెర్షన్‌లో హీరోకు నాని డబ్బింగ్ చెప్పారు.
♦ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంలో సీనియర్ దర్శకులు కె.బాలచందర్, కె. విశ్వనాథ్‌లు ఇద్దరూ నటించారు. బాలచందర్ పాత్రకు తెలుగులో మిమిక్రీ కళాకారుడు హరికిషన్ డబ్బింగ్ చెప్పారు.
♦ ‘దొంగాట’ చిత్రంలో ‘ఏందిరో... ఈ మగాళ్లు ’ పాటను మంచు లక్ష్మీ ప్రసన్న స్వయంగా ఆలపించారు. ఈ సినిమాలో ఒక పాటలో నాగార్జున, రవితేజ, నాని, రానా, సుశాంత్, సుధీర్‌బాబు, నవదీప్, శింబు గెస్ట్‌లుగా కనిపిస్తారు.
♦ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి చాలా ఏళ్ల క్రితం ‘కళ్లు’ సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్... కొక్కొరోకో ’ పాట పాడారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో పాడారు. ఈ ఏడాది దర్శకుడు క్రిష్ నిర్మించిన తమిళ ‘శైవమ్’ రీమేక్ ‘దాగుడుమూత దండాకోర్’లో ఒక పాటలో సీతారామశాస్త్రి గొంతు వినవచ్చు. ఈ సినిమాలో 4 పాటలను సంగీత దర్శకుడే (ఇ.యస్ మూర్తి) రాశారు.
♦ ‘మోసగాళ్లకు మోసగాడు’ లో హీరో సుధీర్‌బాబు కొడుకు మాస్టర్ చరిత్ మానస్ నటించారు.
♦ పెళ్లి నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ తొలిసారిగా ‘365 డేస్’ అనే సినిమా చేశారు. ఇందులో ‘వద్దురా... పెళ్లి వద్దురా...’ పాటను పోసాని కృష్ణమురళి స్వయంగా ఆలపించారు.
♦ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ మరాఠీ చిత్ర రీమేక్ ‘ఆంధ్రా పోరి’తో హీరో అయ్యారు.
♦ తెలుగు, తమిళాల్లో నేరుగా, మలయాళ, హిందీ భాషల్లో అనువాద చిత్రంగా అంగరంగ వైభవంగా ‘బాహుబలి’ విడుదలైంది. సోషల్ మీడియాలో కీలక సమాచారం సెలెక్టెడ్ లీకులతోనే కావాల్సినంత ప్రచారం పొందిన ఈ చిత్రం ‘రేపే విడుదల’, ‘నేడే విడుదల’ లాంటి యాడ్స్ ఏమీ లేకుండా విడుదలై, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సినిమాకూ జరగనంత వ్యాపారం, రానన్ని వసూళ్ళు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ‘పచ్చబొట్టేసినా...’ పాటను ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేస్తే కోటిన్నర క్లిక్‌లు వచ్చాయి.
♦ చాలా విరామం తర్వాత శ్రీదేవి ‘పులి’ అనే దక్షిణాది చిత్రంలో నటించారు. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజైంది.
♦ రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’లో చిరంజీవి గెస్ట్ వేషం వేశారు. చిరంజీవి 8 ఏళ్ల తర్వాత తెరపై కనబడి, 150వ చిత్రం మైలురాయి చేరుకున్నారు. ఇక హీరోగా పూర్తిస్థాయిలో నటించే 151వ సినిమానే బాకీ.
♦ అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్’లో ఆఖరి పాటలో నాగార్జున తళుక్కున మెరిశారు. హీరో నితిన్ ఈ సినిమా నిర్మించడం విశేషం.
♦ ఉత్తరాది సంస్థ రాజశ్రీ వారు సల్మాన్‌ఖాన్‌తో తీసిన ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ను తెలుగులో ‘ప్రేమ్‌లీల’గా డబ్ చేశారు. దీనిలో సల్మాన్‌ఖాన్‌కు హీరో రామ్‌చ రణ్ డబ్బింగ్ చెప్పారు.
♦ కమల్‌హాసన్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డెరైక్ట్‌గా ‘చీకటిరాజ్యం’ సినిమా చేశారు.
♦ ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారెంటీ’ అనే సినిమాలో రెండు పాటలను దర్శకుడు వంశీ స్వరపరిచారు. ఇందులో ఓ పాత్రను దర్శకుడు దేవీప్రసాద్ పోషించారు.
♦ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, కష్టపడి స్వయంగా బరువు పెరిగిన ‘సైజ్ జీరో’-ఇలా ఒకే ఏడాది మూడు విభిన్న తరహా చిత్రాల్లో నటించి, హీరోయిన్ అనుష్క ఏడాది పొడుగూతా వార్తల్లో నిలిచారు.
♦ దర్శకుడు గుణశేఖర్ జీవితాన్ని పణంగా పెట్టి, తెలుగువారి చరిత్రయిన కాకతీయ సామాజ్య్ర కథను ‘రుద్రమదేవి’గా అందించారు. భారతదేశంలో స్టీరియోస్కోపిక్ త్రీడీలో తయారైన తొలి చారిత్రక కథా చిత్రం ఇదే. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. అమరావతి సహా దక్షిణాదిలో చాలాభాగాన్ని పాలించిన రుద్రమదేవి వెండితెర చరిత్రపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కరుణ చూపించలేదు.
♦ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కోసం త్రీడీలో డిజిటల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా చేయడం ఇండియాలో ఇదే ప్రథమం అట.
♦ సింగిల్ కేరెక్టర్‌తో ‘పంచమి’ సినిమా (నటి వేద) వచ్చింది.
♦ బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రం ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరుల్లో రోజుకు 4 ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకొంది. ప్రదర్శన రంగంలో డిజిటల్ విధానం వచ్చాక ఇన్ని రోజులు ఓ సినిమా ప్రదర్శితమవడం దేశంలోనే ఇది తొలిసారి.
♦ విమర్శకుడు కత్తి మహేశ్ డెరైక్ట్ చేసిన ‘పెసరట్టు ’ - క్రౌడ్ ఫండింగ్‌తో చేసిన తొలి తెలుగు చిత్రంగా మిగిలింది.
♦ ‘నాగ భైరవి’ పేరుతో ఒక త్రీడీ డబ్బింగ్ హారర్ ఫిల్మ్ రిలీజైంది. తెలుగులో తొలి హారర్ త్రీడీ ఫిల్మ్ ఇదే.
♦ మొత్తం తెలంగాణ తారలు, సాంకేతిక నిపుణులతో రూపొందిన తొలి చిత్రం ‘బందూక్’ ఈ ఏడాదే వచ్చింది.
♦ సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెలుగులో తొలిచిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. మంజునాథ్ డెరైక్టర్. ‘మధుర ’ శ్రీధర్ నిర్మాత.
♦ ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన తొలి తెలుగు చిత్రం ‘రెడ్ అలర్ట్’. చంద్రమహేశ్ డెరైక్టర్. సంస్కృతంలో విఘ్నేశ్వరునిపై పాట (రచన వెనిగళ్ళ రాంబాబు, గానం శంకర్ మహదేవన్) పెట్టారు.
♦ ‘బ్రూస్‌లీ’ై టెమ్‌లో ‘రామ్‌చరణ్ యాప్’ రిలీజ్ చేశారు. తెలుగులో ఒక హీరో పేరుతో యాప్ రావడం ఇదే ఫస్ట్.