కంగారు పెట్టడానికి ఐదువందల మంది ఉంటారు!
మరో రెండు నెలల్లో కరీనా కపూర్ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ‘మాతృత్వం ఓ తీయని వరం’ అంటున్నారామె. పుట్టబోయే బిడ్డ కోసం సైఫ్ (భర్త సైఫ్ అలీఖాన్), నేనూ ఏవేవో పేర్లు ఆలోచిస్తున్నాం అని కూడా అన్నారు. మరికొన్ని విశేషాలు కరీనా మాటల్లో...
‘యు ఆర్ ప్రెగ్నెంట్’ అని డాక్టర్ చెప్పినప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నా జీవితంలో అప్పటివరకూ అలాంటి అనుభూతిని నేను ఎరగను. మొదటిసారి తల్లయ్యే ప్రతి అమ్మాయికీ ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఒకవైపు చాలా ఎగ్జైటింగ్‌గా మరోవైపు నెర్వస్‌గా ఉంది. జీవితం కొత్తగా అనిపిస్తోంది. ఏం తినాలి? ఏవి తినకూడదు? అంతా కన్‌ఫ్యూజన్. మా అమ్మగారు, అత్తగారు ఇస్తున్న సలహాలు పాటిస్తున్నా.
ప్రెగ్నెంట్ లేడీస్‌కి సలహాలు ఇవ్వడానికి బోల్డంత మంది రెడీగా ఉంటారు. నాకైతే కనీసం 500 మందైనా టిప్స్ ఇచ్చి ఉంటారేమో. అవి విన్నప్పుడు కంగారుగా ఉంటోంది. అందుకే అన్ని సలహాలనూ ఒక చెవితో విని, ఇంకో చెవి నుంచి బయటకు పంపించేస్తున్నా (నవ్వుతూ). ఇంట్లోవాళ్లు చెప్పింది వింటున్నా. సైఫ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. కెరీర్ పాడవుతుందన్నారు. పెళ్లి ముఖ్యం కాబట్టి, కెరీర్ గురించి ఆలోచించలేదు. సైఫ్‌ని పెళ్లాడిన తర్వాత కూడా నాకు అవకాశాలు బాగానే వచ్చాయి. తల్లవ్వాలనుకున్నప్పుడు వద్దన్నవాళ్లూ ఉన్నారు. మాతృత్వం ఓ తీయని వరం. అందుకే ఎవరి మాటా లెక్క చేయలేదు. అయినా కెరీర్‌కీ వ్యక్తిగత విషయానికీ సంబంధం ఏంటి? ప్రెగ్నెన్సీ కన్‌ఫార్మ్ అయినప్పట్నుంచీ బిడ్డ పుట్టిన కొన్ని నెలల వరకూ సినిమాలు చేయలేనేమో. ఆ తర్వాత చేస్తాను.
ఆ మధ్య నేను ర్యాంప్ వాక్ చేసిన విషయం తెలిసిందే. కడుపు కనిపించకుండా చున్నీ కప్పేసుకో అని కొంతమంది సలహా ఇచ్చారు. సెలబ్రిటీల ఇమేజ్ దెబ్బ తింటుందన్నది కొందరి ఊహ. అందుకే అలా అంటారు. ప్రెగ్నెన్సీ అనేది తప్పేం కాదు కదా... దాచుకోవడానికి. ‘మీది పెద్ద కుటుంబం కాబట్టి, బిడ్డను జాగ్రత్తగా పెంచాలి’ అని ఇప్పుడే కొంతమంది భయపెట్టడం మొదలుపెట్టారు. నేనూ, సైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాం. అందుకే బాడీగార్డ్స్‌ని పెట్టుకోలేదు. నా బిడ్డ కోసం కూడా పది మంది బాడీగార్డులను పెట్టం. నార్మల్‌గానే పెంచుతాం.