అజయ్‌ ధనాధన్‌ | Full story about Ajay Devgan | Sakshi
Sakshi News home page

అజయ్‌ ధనాధన్‌

Published Thu, Jan 19 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

అజయ్‌ ధనాధన్‌

అజయ్‌ ధనాధన్‌

►  అసలు పేరు విశాల్‌ వీరూ దేవగన్‌.
► అజయ్‌ అని తనే మార్చుకున్నాడు.
► అవార్డు వేడుకలకు హాజరు కావడం, పెళ్లిళ్లలో డాన్సులు చేయడం నచ్చవు.
► భార్య కాజోల్‌తో కలతలు లేని కాపురం.
► తల్లితండ్రులు, భార్యాపిల్లలతో ఉమ్మడి కుటుంబంగా జీవించడం ఇష్టం. అదే పాటిస్తున్నాడు.
► సొంత జెట్‌ విమానం ఉన్న ఏకైక హిందీ సూపర్‌స్టార్‌.


ప్రేమకథలు
అజయ్‌ దేవగన్‌ కరిష్మా కపూర్‌నూ, రవీనా టాండన్‌నూ ఏకకాలంలో ప్రేమించాడని కథనం. కరిష్మాతో పీకల లోతు ప్రేమలో ఉండి కూడా రవీనా మీద మనసు పడ్డాడనీ, ఇద్దరూ ఈ విషయాన్ని గమనించడంతో రెంటికీ చెడ్డ రేవడు అయ్యాడనీ అంటారు. లొడలొడమని మాట్లాడే కాజోల్, అసలేమీ మాట్లాడకుండా ఉండే అజయ్‌ని సెట్లో చూసి మొదట చిరాకు పడిందట. కానీ తొలి సన్నివేశంలో ఆమె చేయి పట్టుకునే సన్నివేశం షూట్‌ చేసేటప్పుడు అతడు చేయి పట్టుకోగానే, గుండె ఝల్లుమని ‘ఇతడిలో ఏదో ఉంది’ అని ఆకర్షింపబడిందట.

వింత ఫోబియా
అజయ్‌ దేవగన్‌కు వింత ఫోబియా ఉంది. అదేమిటంటే భోజన పదార్థాలను అతడు చేతితో ముట్టుకుని తినడు. అలా తింటే ఆ పదార్థాల వాసన తన చేతికే అంటుకు పోతుందనే ఫోబియా అతడికి ఉంది.

చినచేపను పెనుచేప మింగడం కామన్‌. కాని ఒకసారి ఏం జరిగిందంటే చినచేపే పెనుచేపను మింగింది.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లమ్హే’ (1991). అనిల్‌ కపూర్, శ్రీదేవి, వహీదా రెహమాన్‌... దర్శకుడు యశ్‌చోప్రా. పరిశ్రమ అంతా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్‌ కావడమే తరువాయి. అదే రోజున ఇంకో సినిమా రిలీజ్‌ కాబోతున్నదని అనిల్‌ కపూర్‌కు తెలిసింది. ‘ఎవరిది?’ వాకబు చేశాడు. అజయ్‌ దేవగన్‌ అని కొత్త కుర్రాడు, అతడి పక్కన హీరోయిన్‌ కూడా మధుబాల అని కొత్తమ్మాయి... దర్శకుడు పెద్ద పేరున్నవాడు కాదు... అతడి పేరు కుకూ కోహ్లీ... వీళ్లంతా తీసిన ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాను ‘లమ్హే’ మీద విడుదల చేస్తున్నారు అని సమాచారం ఇచ్చారు.

అనిల్‌ కపూర్‌కు కొంచెం నవ్వు, ఆ వెంటనే అజయ్‌ పట్ల అక్కర ఏర్పడ్డాయి. అజయ్‌ దేవగన్‌ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి అనిల్‌కపూర్‌కు తెలుసు. అజయ్‌ తండ్రి వీరూ దేవగన్‌ పెద్ద స్టంట్‌ మాస్టర్‌. అలా పరిచయం. వెంటనే అజయ్‌ దేవగన్‌ను పిలిపించాడు. ‘ఏరా.. ఎందుకు తొందర. మా సినిమా అయ్యాక వేసుకో. నీ మంచికే చెబుతున్నాను. లేకుంటే పచ్చడైపోతావు’ అని హితవు చెప్పాడు. కాని అప్పటికే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసేశారు. ‘నేనేం చేయగలను అంకుల్‌. ప్రొడ్యూసర్‌ డేట్‌ అనౌన్స్‌ చేసేశాడు. ఇక ఎలా జరగాలనుంటే అలా అవుతుంది’ అన్నాడు అజయ్‌ దేవగన్‌. ‘సరే.. ఏనుగుతో కుందేలు డీ కొట్టాలనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు’ అని ఊరుకున్నాడు అనిల్‌ కపూర్‌

అలాంటి హీరో ఎంట్రీ ఎవరూ ఎప్పుడూ చూడలేదు సినిమాలో. రెండు బైక్‌లను ఇద్దరు నడుపుతుంటే వెనుక చెరోకాలు రెండు బైక్‌ల మీద వేసి నిలబడి ఎంట్రీ ఇస్తాడు అజయ్‌ దేవగన్‌ ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’లో. ఒక్క క్షణమే. వెంటనే మాస్‌కు కనెక్ట్‌ అయిపోయాడు సినిమాలో. డైలాగ్‌ బాగా చెబుతున్నాడు. ఫైట్స్‌ బాగా చేస్తున్నాడు. అప్పట్లో నదీమ్‌ – శ్రావణ్‌ల హవా నడుస్తోంది. సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌. ‘మైనే ప్యార్‌ తుమ్హీసే కియా హై’... ఆ పాట ఒకటి, ‘తుమ్‌సే మిల్‌నే కో దిల్‌ కర్తాహై’... ఈ పాట ఒకటి మోగిపోయాయి.

రెండో రోజు నుంచే కలెక్షన్లు ఊపందుకున్నాయి. నాలుగు వారాలు గడిచాయి. ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సూపర్‌ హిట్‌. ఏదో పార్టీలో అనిల్‌ కపూర్‌ మళ్లీ అజయ్‌ దేవగన్‌కు కనిపించాడు.
‘ఏరా.. నిన్ను కాపాడబోయి నేనే పచ్చడైపోయాను. చితగ్గొట్టేశారుగా’ అన్నాడు నవ్వుతూ.
‘లమ్హే’ అడ్రస్‌ లేదు. ఫ్లాప్‌.
అలా అజయ్‌ దేవగన్‌ అడుగు పెట్టడమే ఏనుగులతో తలపడుతూ వచ్చాడు.

వీరూ దేవగన్‌ అమృతసర్‌ నుంచి టికెట్‌ లేని ట్రైనులో ముంబై చేరుకున్నాడు చాలా ఏళ్ల క్రితం. అతని లక్ష్యం హీరో కావాలని. కానీ ముంబైలో ఎవరూ పట్టించుకోలేదు. కొన్నాళ్లు కార్పెంటరీ, కొన్నాళ్లు రోడ్ల మీద కార్లు తుడిచి, ఆ తర్వాత అక్కడ ఒక గోదా ఉంటే అక్కడ పహిల్వాన్‌గిరి నేర్చుకున్నాడు. ఆ అనుభవంతో అప్పట్లో స్టంట్‌ మాస్టరైన రవి ఖన్నా దగ్గర సహాయకుడిగా చేరి చాలా తొందరగా పెద్ద స్టంట్‌ మాస్టర్‌ అయ్యాడు. ‘మిస్టర్‌ నట్వర్‌లాల్, దోస్తానా, క్రాంతి’ వంటి భారీ సినిమాలకు అతడే స్టంట్‌ డైరెక్టర్‌. అయితే తను హీరో కాలేదని అతడికి వెలితి ఉండేది. తాను తీర్చుకోలేని కోరిక తన కొడుకు ద్వారా తీర్చుకుంటానని శపథం పట్టాడు. అజయ్‌ దేవగన్‌ను హీరోను చేయాలని అనుకున్నాడు. కాని అజయ్‌ దేవగన్‌కు ఆ కోరిక ఎంత మాత్రమూ లేదు. ఇప్పుడెలా?

అజయ్‌ దేవగన్‌ అంతర్ముఖుడు. సిగ్గరి. పెద్దగా ఎవరితోనూ మాట్లాడడు. ఇక ముఖం చూస్తే హిందీ సినిమా హీరోల ముఖానికి ఏ మాత్రం సరిపోదు. ఆ పెద్ద ముక్కు... ఆ తక్కువ రంగు... ఇతను హీరో కాగలడా? కాని తండ్రి యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్పించి, ఫైట్స్, హార్స్‌ రైడింగ్‌ నేర్పిస్తూ ఉన్నాడు. అజయ్‌ ఫ్రెండ్స్‌తో (డైరెక్టర్‌ విక్రమ్‌ భట్, డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్, నటి తబూలు అతని క్లాస్‌మేట్స్‌) సరదాగా తిరుగుతూ డైరెక్టర్‌ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. కథ ఎలా నడిచేదో కాని అక్షయ్‌ కుమార్‌ ఈ కథను మలుపు తిప్పాడు.

కుకూ కోహ్లీ అనే దర్శకుడు ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ స్క్రిప్ట్‌ రాసుకుని, అక్షయ్‌కుమార్‌ని హీరోగా పెట్టుకున్నాడు. అక్షయ్‌ అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నాడు కనుక కొత్త కుర్రాడితో చేద్దామని కుకూ కోహ్లీ ఆలోచన. అయితే ఆ వెంటనే ఒక పెద్ద బ్యానర్‌ నుంచి అక్షయ్‌కు అవకాశం రావడంతో అతడు ఏవో కుంటి సాకులు చెప్పి ఈ సినిమాను వదిలేశాడు. అన్నీ ఏర్పాట్లు ముగిశాక ఇలాంటి దెబ్బ తగలడంతో కుకూ కోహ్లీకి ఏం చేయాలో తోచలేదు. అతనికి వీరూ దేవగన్‌ మంచి ఫ్రెండ్‌. ఒకరోజు వీరూ దేవగన్‌ ఆఫీసుకు వెళితే అక్కడ అజయ్‌ దేవగన్‌ ఫొటో కనిపించింది. చూశాడు. ముఖం బాగలేదు. కాని కళ్లల్లో ఏదో లోతు ఉంది. ‘చాలు... ఇతనితో బండి నడిపించుకుంటాను’ అనుకున్నాడు.

తండ్రిని అడిగితే సంతోషంగా అంగీకరించాడు. కొడుకుకు వేరే దారి లేదు. నెలలో షూటింగ్‌ మొదలైంది. సెట్‌లో ఉన్న ప్రతీవాడు అజయ్‌ ముఖాన్ని చూసి లోలోపల నసుక్కోవడమే. కొందరైతే డైరెక్టర్‌తో, ‘ఇతణ్ణి పెట్టి ఎలా సినిమా తీస్తున్నావ్‌’ అని హెచ్చరించారు కూడా. కాని అదృష్టం అజయ్‌ పక్షాన ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? సినిమా రిలీజయ్యింది. సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. పాపం అక్షయ్‌ మరి కొన్నాళ్లు కష్టపడితే తప్ప అలాంటి హిట్‌ను చూడలేకపోయాడు.

అజయ్‌ దేవగన్‌కు యాక్షన్‌ సినిమాల హీరో అని ముద్ర పడింది. ‘దిల్‌ వాలే’ (1994), ‘విజయ్‌ పథ్‌’ (1994), ‘దిల్‌ జలే’ (1996) వంటి సినిమాలు ఆ ధోరణిని స్థిరపరిచాయి. ఆమిర్‌ ఖాన్‌తో కలిసి చేసిన ‘ఇష్క్‌’ (1997) కూడా బాగానే ఆడింది. కాని అతని కంటూ ఒక ముద్ర, గౌరవం పెద్దగా ఏర్పడలేదు. అందరిలో ఒకడిగా ఉన్నాడు. ఇది తండ్రి వీరూ దేవగన్‌కు నచ్చలేదు. తన కుమారుడు ఆర్టిస్ట్‌గా కూడా రాణించాలని తన చిరకాల మిత్రుడు మహేశ్‌ భట్‌ దగ్గరకు వెళ్లి, ‘మా వాడితో ఏదైనా సినిమా తియొచ్చు కదా’ అని అడిగాడు.

అప్పుడే మహేశ్‌ భట్‌ ముంబై అల్లర్లు, తత్ఫలి తంగా హిందూ ముస్లింలలో పేరుకొని పోతున్న అభద్రత... ఈ అంశం మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు. ఆ సినిమాలో హీరోగా వేయడం అంటే కేవలం పాత్రను జీవింప చేయడమే. మహేశ్‌ అజయ్‌ను నమ్మాడు. అజయ్‌ తనకొచ్చిన అవకాశానికి నూరు శాతం న్యాయం చేయడానికి కష్టపడ్డాడు. అలా ‘జఖ్మ్‌’ (1998) అజయ్‌ జీవితంలో కీలకమైన సినిమాగా మారింది. అంతే కాదు అతడికి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది.
ఎస్‌. ఈ అండర్‌ డాగ్‌ ఇప్పుడు జాతీయ ఉత్తమనటుడు.

ఇక అక్కడి నుంచి మంచి డైరెక్టర్లందరూ అజయ్‌కు గౌరవం ఇచ్చి అతడి కోసంగా పాత్రలు సృష్టించడం మొదలుపెట్టారు. సంజయ్‌ లీలా భన్సాలీ ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ భర్త పాత్ర ఇస్తే ఆ పాత్రను ఎంతో హుందాగా చేసి సల్మాన్‌ ఖాన్‌తో పాటు తనకూ పేరు తెచ్చుకున్నాడు అజయ్‌. రామ్‌గోపాల్‌ వర్మ ‘కంపెనీ’ (2002)లో దావూద్‌ ఇబ్రహీమ్‌ పాత్రను ఇస్తే, దాన్ని గొప్పగా పోషించి సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడతడు.

రాజ్‌కుమార్‌ సంతోషి ‘ది లెజండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌’ తీసి అందులో భగత్‌ సింగ్‌ పాత్రను అజయ్‌ దేవగన్‌కు ఇస్తే అఖిల భారత ప్రేక్షకులు ఆదరించేలా ఆ పాత్రను చేసి కంట తడి పెట్టించాడు అజయ్‌. విడుదల సమయంలో ఈ సినిమాతో పాటు మరో ఐదు భగత్‌సింగ్‌లు విడుదలై, ఒక అయోమయం ఏర్పడినా కాలక్రమంలో భగత్‌సింగ్‌ సినిమా అంటే అజయ్‌ దేవగన్‌ సినిమాయే అని స్థిరపడింది. అందులో ఉరిశిక్షకు ముందు భగత్‌ సింగ్‌ పాత్రలో అజయ్‌ పాడే ‘ముఝే రంగ్‌ దే బసంతి’ పాటను చూసిన వారెవ్వరూ ఒక గొప్ప ఉద్వేగాన్ని అనుభూతి చెందకుండా ఉండలేరు.

అజయ్‌ దేవగన్‌ కెరీర్‌లో దర్శకుడు ప్రకాష్‌ ఝా, దర్శకుడు రోహిత్‌ షెట్టి ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రకాష్‌ ఝా అతడికి ‘గంగాజల్‌’, ‘అపహరణ్‌’, ‘రాజనీతి’ వంటి సినిమాలను ఇస్తే – రోహిత్‌ షెట్టి అజయ్‌ ధోరణిని కామెడీలోకి దింపి ‘గోల్‌మాల్, గోల్‌మాల్‌ రిటర్న్స్, గోల్‌మాల్‌ 3, సింగం, సింగం రిటర్న్స్, బోల్‌ బచ్చన్‌’ వంటి హిట్స్‌ ఇచ్చాడు. వీటి మధ్యలో ‘అతిథి... తుమ్‌ కబ్‌ జావోగే?’, ‘సన్నాఫ్‌ సర్దార్‌’ వంటి హిట్స్‌ అతడి ఖాతాలో ఉన్నాయి.

అజయ్‌ దేవగన్‌కు ఎటువంటి మూసా లేదు. అతడు ఏ పాత్రైనా చేయగలడు ఎలాంటి సినిమా అయినా ఒడ్డున పడేయగలడు. అందుకే అతడు స్థిరంగా పాతికేళ్లుగా పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు. మరో పాతికేళ్లు కూడా ఒక ఆర్టిస్టుగా అతడు కొనసాగే గౌరవం, ప్రతిభ, వినయం, అంకితభావం అతడిలో ఉన్నాయి. నిర్మాతగా దర్శకుడిగా అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాని మంచి సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలన్న అభిలాష మాత్రం అతడిలో ఉంది.
ముఖాన్ని కాదు నటనను, తపనను నమ్ముకుంటే విజయం ఉంటుంది... అజేయం ఉంటుంది అని నిరూపించినవాడు అజయ్‌.
ఏనుగులను ఢీ కొట్టే ‘సింగం’ అతడే!
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement