ఆ రూట్‌లో వెళ్లడం నాకిష్టం లేదు
అప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన రోల్స్‌రాయస్ కారులా ఉంటాడు రామ్. వేగం అతని శైలి. కెమెరా ముందుకొస్తే... చెలరేగిపోవడం అతని నైజం. అందుకే తక్కువ సినిమాలతోనే యువత కు అభిమానపాత్రుడు అయ్యాడు రామ్. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘మసాలా’. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
నా దృష్టిలో ఆయన లివింగ్ లెజెండ్
తెలుగు సినిమాకు నాలుగు పిల్లర్లుగా నిలిచిన నలుగురు హీరోల్లో వెంకటేష్‌గారు ఒకరు. నా దృష్టిలో ఆయన లివింగ్ లెజెండ్. ఆయనతో కలిసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేను. వెంకటేష్‌గారితో కలిసి నటించడానికి నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే... మా స్రవంతి సంస్థలో ఆయన రెండు సినిమాలు చేశారు. చిన్నప్పట్నుంచీ ఆయన్ను దగ్గరగా చూసిన వాణ్ణి. ‘నువ్వునాకు నచ్చావ్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి చూశాను. అందుకే... వెంకీగారితో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు కొత్తగా అనిపించలేదు. పైగా ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడానికి కారణం కూడా వెంకటేష్‌గారే. ‘బోల్‌బచ్చన్’ సినిమా చూసి ఆయనే మా పెదనాన్నగారికి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పారట. ‘నేను, రామ్ కలిసి నటిస్తే బాగుంటుంది’ అని సలహా కూడా వెంకటేష్‌గారే ఇచ్చారట.
‘బోల్‌బచ్చన్’కి ఏ మాత్రం తగ్గదు
ఇప్పటివరకూ ఓ పది సినిమాల్లో నటించాను. కథా పరంగా చూసుకుంటే అన్నీ కొత్తగా ఉంటాయి. ‘బోల్‌బచ్చన్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కినా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు కొత్తగానే ఉంటుంది. స్క్రిప్ట్ విషయంలో విజయభాస్కర్ అంకుల్ చాలా వర్క్ చేశారు. కథని, రైటర్‌ని ఇచ్చి వదిలేస్తే చాలు... పిండేస్తారాయన. వెంకటేష్‌గారి పాత్రను, నా పాత్రను చాలా బ్యాలెన్సింగ్‌గా డీల్ చేశారు. ‘బోల్‌బచ్చన్’కి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని మలిచారు. భారతీయ సినీ చరిత్రలో తెలుగు సినిమా హాస్యానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ విలువలు, ఆ ప్రత్యేకత మిస్ కాకుండా ఈ సినిమా ఉంటుంది. జనాలను నవ్వించడానికి ఓ మంచి ప్రయత్నం చేశాం.
ఈ సినిమా చేయకూడదనుకున్నా...
ఈ సినిమా ప్రపోజల్ నా వద్దకు రాగానే.. ‘బోల్‌బచ్చన్’ సినిమా తెప్పించుకుని చూశాను. చాలా బాగా నచ్చింది. అయితే... నేను మాత్రం ఈ సినిమా చేయకూడదని అనుకున్నాను. దానికి కారణం అభిషేక్‌బచ్చన్ పాత్రలోని రెండోకోణం. ఆ యాంగిల్‌లో నన్ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనే మిమాంసలో పడిపోయా. రెండ్రోజులు ఆలోచించిన తర్వాత చేయాలని నిర్ణయం తీసుకున్నా. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలు కూడా ఇమేజ్‌ని పక్కన పెట్టి వైరైటీ పాత్రలు చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు అనిపించే ఈ పాత్ర ఒప్పుకున్నా.
శివశంకర్ మాస్టార్ని ఫాలో అయిపోయా
ఇందులో గే షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విషయంలో నాకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి శివశంకర్ మాస్టార్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమే
ఓ పాట జరిగింది. ఆ పాటకు శివశంకర్ మాస్టారే కొరియోగ్రాఫర్. ఆయన్ను అలాగే గమనించాను. చివరకు ఆయన్నే ప్రేరణగా తీసుకొని ఈ పాత్ర చేశాను. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది.
ఇప్పటికి మూడు కథలు కొన్నాను
సరైన కథలు దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి నేను రెడీ. ఇక నుంచి సినిమాలు ఒప్పుకునే విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు సినిమా ప్రస్తుతం కాంబినేషన్‌లపై నడుస్తోంది. ఆ రూట్‌లో వెళ్లడం నాకిష్టం లేదు. ముందు కథ, తర్వాతే కాంబినేషన్లు. ఏదైనా కథ నచ్చితే వెంటనే కొనేస్తున్నాను. ఇప్పటికి మూడు కథలు కొన్నాను. తర్వాత దర్శకులను వెతుకుతాను. ఇలా చేయడం వల్ల కథలకోసం వేచివుండాల్సిన అవసరం ఉండదు. కథల్ని కొన్నంత మాత్రాన టైటిల్ కార్డ్ నాదే వేసుకుంటానని అనుకునేరు. అంతటి నీచమైన పని చేయను. కథ ఎవరిదో వారిదే టైటిల్ కార్డ్ కూడా ఉంటుంది.