
చిక్కుల్లో ఇద్దరు నటులు
ముంబై: అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కమెడియన్ కపిల్ శర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్‌లోని డీఎల్‌హెచ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు.
అపార్ట్‌మెంటులోని 9వ అంతస్తులో కపిల్ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్ ఖాన్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గురించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్(ఎంఆర్ టీఎస్) 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు.