
జమునగా సమంత?
సమంత సీనియర్ నటి జమునగా మారనున్నారా? అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఈ కథేంటో చూద్దామా ‘మహానటి సావిత్రి జీవిత కథ వెండితెర రూపం దాల్చనున్న విషయం తలిసిందే. ఇండియన్ సినిమా మరువలేని, మరపురాని మహానటి సావిత్రి. ఆమె సినీ జీవితం నేటి నటీమణులకు స్ఫూర్తి అయితే వ్యక్తిగత జీవితం ఒక పాఠం. అలాంటి పలు ఆసక్తికరమైన సావిత్రి జీవితకథను మహానటి పేరుతో తెలుగులోనూ, నడిగైయన్ తిలగం పేరుతో తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది. యువ దర్శకుడు నాగఅశ్వన్ దర్శకత్వం వహించనున్న ఇందులో మహానటి సావిత్రి పాత్రలో యువ క్రేజీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారు.
ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ తనను సావిత్రి రూపంలోకి మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. ఆమె పాత్ర ఏమటన్నదానికి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట నటి సావిత్రి సమకాలీన నటి జమున. ఆ పాత్రగా నటి సమంత మారనున్నారని సమాచారం. జమున కూడా తన అసాధారణ నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్న గొప్పనటి.
అయితే మహానటి సావిత్రి జీవిత కథా చిత్రంలో నటి జమున పాత్ర ఏమిటన్నది ఆసక్తికరమైన అంశం. సావిత్రి, జమున మంచి స్నేహితురాళ్లు, ఒక సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటారు. అలాంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించనున్నారా? అదే విధంగా నటి సావిత్రి జీవితంలో నటుడు, ఆమె భర్త జెమినీగణేశన్ ది కీలక పాత్ర. ఈ చిత్రంలో ఆయన పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న నడిగైయన్ తిలగం(మహానటి) చిత్రంపై చిత్ర పరిశ్రమలో కుతూహలం నెలకొందన్నది మాత్రం నిజం.