అభిమాని కోసం ఆత్మీయ మిత్రుడితో...
పవన్‌కల్యాణ్ నిర్మాతగా మారారనేది కొత్త విషయం కాదు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ నిర్మాతల్లో ఆయనొకరు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆత్మీయ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలసి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. అయితే.. ఇందులో పవన్ హీరోగా నటించడం లేదు. ఆయన అభిమాని నితిన్ హీరో. పాటల రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ‘రౌడీ ఫెలో’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది.
నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, పవన్‌కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. తొలిసారి వేరే హీరోతో పవన్ సినిమా నిర్మిస్తుండడం ఓ విశేషమైతే... త్రివిక్రమ్ ఓ నిర్మాతగానే కాకుండా మూల కథను కూడా అందించడం మరో విశేషం. ఈ చిత్రానికి కళ: రామకృష్ణ, కెమేరా: ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్.