అమితాబ్ కు శాంసంగ్ షాక్!
ముంబై: బ్యాటరీ పేలుళ్లతో వినియోగదారులను భయపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఎదురవుతున్న ఇబ్బందులను ‘బిగ్ బి’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫోన్ పూర్తిగా చార్జింగ్ ఎక్కడం లేదని ఆయన తెలిపారు.
‘నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ వాడుతున్నాను. ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 60 శాతంకు మించి ఎక్కడం లేదు. 100 శాతం చార్జింగ్ ఎప్పుడు అవుతుంది? శాంసంగ్ వెంటనే స్పందించాల’ని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనిపై అభిమానుల నుంచి వెంటనే స్పందన వచ్చింది. గెలాక్సీ నోట్ 7 పేలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ఫోన్ మార్చాలని వికాస్ సింగ్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. బ్యాటరీలో సమస్య తలెత్తడంతో 25 లక్షల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది.
అమితాబ్ ట్వీట్ పై శాంసంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆయనకు కొత్త ఫోన్ ఇస్తుందో, బ్యాటరీ మారుస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ రోజే ఎత్తివేసింది.
T 2395 -I have Samsung Note 7. Battery charge restricted to 60%. When will it allow me to go 100 ? Mr Samsung please respond ! zara jaldi ! pic.twitter.com/VVkzPqXh1j
— Amitabh Bachchan (@SrBachchan) 30 September 2016