అన్నీ ఆశ్చర్యాలే!
‘‘ఇవాళ గృహిణిలందరూ దాదాపు టీవీకి పరిమితమవుతున్నారు. పైగా, కుటుంబ ప్రేక్షకులు చూసే షోస్, సీరియల్స్ ఇస్తున్న ‘జీ తెలుగు’ వంటి చానల్స్‌కి మంచి ఆదరణ ఉంటోంది. చిన్నప్పటి నుంచి ఈ చానల్ చూస్తున్న నేను ఇప్పుడు ఏకంగా ప్రచారకర్తగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది’’ అని తమన్నా అన్నారు. జీ తెలుగు చానల్‌కు తమన్నా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయాన్ని చానల్ బిజినెస్ హెడ్ అనురాధ హైదరాబాద్‌లో మీడియా సమక్షంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా తమన్నా తన కెరీర్ గురించి మాట్లాడుతూ -‘‘ ‘బాహుబలి’ కోసం కత్తి తిప్పడం నేర్చుకున్నా. రాజమౌళి సార్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఒకటో భాగంలో కంటే, రెండో భాగంలో నా పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నేను కథానాయిక అయ్యి, పదేళ్లు పూర్తయ్యింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ ఆశ్చర్యాలే. కథానాయిక కావడం సర్‌ప్రైజ్.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశమూ ఆశ్చర్యకరమే. ఏ సినిమా చేసినా మనసు పెట్టి చేశా. వచ్చిన అవకాశాల్లో ‘ది బెస్ట్’ అనుకున్నవి చేస్తూ, ముందుకు సాగుతున్నా’’ అని చెప్పారు.