సీఎం ఎవరు?!
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అన్న దానిపై బీజేపీ అధిష్టానం ఇంకా ఒక నిర్ణయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి ఎవరవుతారన్న చర్చ పార్టీ నగర నాయకత్వంలో మొదలైంది. అసెంబ్లీలో తగిన సంఖ్యా బలం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడడంతో ఇక ముఖ్యమంత్రి ఎవరన్న చర్చకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి నెగ్గడం, కేబినెట్ మంత్రి కావడం, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్నదానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.
పస్తుతం ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్తున్న నేతలలో ఎవరికీ సీఎం కాగలిగిన సామర్థ్యం లేదన్న అభిప్రాయం కూడా కొందరు బీజేపీ సీనియర్లలో ఉంది. ఈ అభిప్రాయం కారణంగా ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్నదానిపై శాసనసభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవాలని బీజేపీ నిర్ణయించిందని, తుది నిర్ణయం మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటారని అంటున్నారు. శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకునే బాధ్యతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఢిల్లీ ఇన్‌చార్జ్ ప్రభాత్ ఝాకు అప్పగించారని అంటున్నారు.
ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్తున్నవారిలో జనక్‌పురి ఎమ్మెల్యే జగ్‌దీశ్‌ముఖి, బదర్‌పుర్ ఎమ్మెల్యే రమేశ్ బిధూడీల పేర్లు కొన్ని రోజులుగా సామాజిక వెబ్‌సైట్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అధిష్టానం సుముఖంగా లేకపోయినప్పటికీ ఈ ఇరువురు నేతలు మాత్రం ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖీ కూడా సీఎం రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ కూడా ఢిల్లీ సీఎం కావాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. కానీ పార్టీ సభ్యురాలు కాకపోవడం వల్ల ఆమె కోరిక ఫలించే సూచనలు అంతగా కనిపించడం లేదు.
మిగతా వారిలో జగ్‌దీశ్ ముఖి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముఖి బీజేపీ ఎమ్మెల్యేలందరిలోకి సీనియర్ . ఆయన ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉండడంతో పాటు ఢిల్లీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే పై బడిన వయసు ఆయనకు ప్రధాన అడ్డంకిగా ఉంది. 74 సంవత్సరాల ముఖిని ముఖ్యమంత్రిని చేయడాన్ని పార్టీలో యువనేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ముఖి మాత్రం సీఎం పదవి కోసం ఫేస్ బుక్‌ద్వారా తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. రమేశ్ బిధూడీ మొదటి నుంచి బీజేపీ నేత కాకపోవడం ఆయనకు అడ్డంకిగా ఉంది. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన బిధూడీకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం సీనియర్ నేతలను అవమానించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆయనను సీఎం చేయడం ద్వారా అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించినట్లు అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
కొత్తగా ఎంపీగా ఎన్నికైన మీనాక్షీ లేఖీ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఆమెను సీఎం చేయాలన్న పోస్టర్లు ఇప్పటికే న్యూఢిల్లీ నియోజకవర్గంలో అక్కడక్కడా వెలిశాయి. దీనివెనుక తన హస్తం లేదని మీనాక్షీ లేఖీ అంటున్నప్పటికీ ఢిల్లీ సీఎం పదవి కోసం ఆమె కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పిన్నవయస్కురాలు దానికి తోడు మహిళ కావడం ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ రాజకీయాలలో ఆమెకు పెద్దగా పట్టులేదని లేఖీ వ్యతిరేకులు అంటున్నారు. ఇక రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. హర్షవర్ధన్‌కు ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు.
కానీ పార్టీ ఆయనను ఆ పదవి నుంచి తొలగించడమే కాక ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉంచి రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యున్ని చేసింది. క్రమశిక్షణ పేరుతో పార్టీ ఆదేశాన్ని శిరసావహించిన విజయ్ గోయల్ ఇప్పుడు మళ్లీ ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించేందుకు ఆసక్తి చూపుతూ సీఎం పదవి కోసం పార్టీలో లాబీయింగ్ చేస్తున్నారు. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 29 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 36 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆమ్ ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్‌కు 8 మంది, మరో ముగ్గురు ఇతర సభ్యులు ఢిల్లీ అసెంబ్లీలో ఉన్నారు.