ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్‌సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment