మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా! | catch Mallya before making me pay Rs 260 fine, says lady traveller | Sakshi
Sakshi News home page

మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా!

Published Wed, Mar 23 2016 7:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా!

మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా!

ప్రజల్లో చైతన్యం, సామాజిక స్పృహ, జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహావేశాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ముంబైలో మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని పట్టుబట్టారు. చివరకు కావాలంటే తాను ఏడు రోజుల జైలు శిక్ష అయినా అనుభవిస్తాను గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టేది లేదని స్పష్టం చేశారు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రేమలతా భన్సాలీ (44) దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటారు. ఆమె ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు రూ.260 జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు.

అలా ఒకటి, రెండు కాదు.. దాదాపు 12 గంటల పాలు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్‌ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement