పాక్ తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలు కోరుకుంటోంది
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శించారు. గురువారం మీరట్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే శంకుస్థాపన సందర్భంగా మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడిన నేపథ్యంలో చిదంబరం శుక్రవారం ప్రతిస్పందించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ సహకరిస్తున్నా మోదీ అనవసరంగా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని చిదంబరం వాపోయారు.
భారతీయ జనతాపార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని చిదంబరం విమర్శిచారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ను తప్పుపట్టడం సరికాదని, కాంగ్రెస్కు ఆ బిల్లుపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు, యూటర్న్లు సత్ఫలితాలను ఇవ్వవని ప్రధాని పాక్ పర్యటనను ఉద్దేశించి చిదంబరం మాట్లాడారు. లోక్సభలో 67 బిల్లులు, రాజ్యసభలో 45 బిల్లులు పాస్ కావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ను అకారణంగా ప్రధాని విమర్శించడం సరికాదన్నారు.