
భావనను భుజాలపై మోసుకెళ్తున్న సోను
లక్నో : మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాడు ఓ పోలీస్ అధికారి. ఆపదలో ఉన్న గర్భిణిని కాపాడి రక్షక భటుడు అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన భావన అనే గర్భిణికి నొప్పులు రావడంతో భర్త సాయంతో ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధపడింది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో రిక్షా ఎక్కేందుకు కూడా వారి వద్ద డబ్బు లేదు. ఈ విషయం గురించి భార్యాభర్తలు చర్చించుకుంటున్న సమయంలో.. వీరి మాటలు విన్న స్టేషన్ ఆఫీసర్ సోను రాజౌరా వారికి సాయం చేయాలనున్నాడు. అంబులెన్సుకు ఫోన్ చేసి మథుర కంటోన్మెంట్ ఏరియాకు రావాల్సిందిగా కోరాడు. అయితే భావనకు నొప్పులు మరీ ఎక్కువ కావడంతో రిక్షాలో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భుజాలపై మోసుకుంటూ...
భావనను మెటర్నిటి వార్డుకు తీసుకువెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు. కానీ మెటర్నిటి వార్డు ఆస్పత్రికి దూరంగా ఉండటంతో స్ట్రెచర్ కావాలని సోను అడిగాడు. అయితే సిబ్బంది ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సోను తన భుజాలపై భావనను మోస్తూ మెటర్నటి వార్డుకు తీసుకువెళ్లాడు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
కాగా సరైన సమయంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడిన సోను.. హీరో అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. సిబ్బందితో వాదిస్తూ సమయాన్ని వృథా చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడని పలువురు ఆయనను అభినందిస్తున్నారు. అదే విధంగా యూపీలోని ప్రభుత్వాసుపత్రుల తీరుపై, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరించే విధానంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment