
న్యూఢిల్లీ: భారత్ కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో తాజాగా 1,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 40 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కు, మొత్తం మరణాల సంఖ్య 559కు చేరిందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్‌లో ఐదుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు కోవిడ్‌తో మరణించారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 14,255 కాగా, 2,841 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారు.
ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు.. 24 గంటల్లో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్‌లో 9 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం మరణాలు 559 కాగా, ఇందులో 223 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 7.5 రోజుల్లో రెట్టింపు అవుతుండగా, ఒడిశాలో 39.8, కేరళలో 72.2 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి.