ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు | Four months after suicide, failed student declared class topper | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు

Published Fri, Nov 13 2015 5:23 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు - Sakshi

ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు

శ్రీనగర్:   పరీక్షలో  ఫెయిల్  అయ్యానని ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, క్లాస్ టాపర్ అని తేలడం విషాదాన్ని నింపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో టెక్నికల్ బోర్డు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ తెలివైన విద్యార్థి  ఉసురు తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే  శ్రీనగర్ లోని  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న  మొహమ్మద్ అద్నాన్ (17) చాలా తెలివైన విద్యార్థి.  ఫిజిక్స్  అంటే అతనికి ప్రాణం.

 

కానీ తనకెంతో ఇష్టమైన  ఫిజిక్స్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు,  కేవలం 28 మార్కులు  మాత్రమే వచ్చినట్టుగా  ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు.  దీంతో   అద్నాన్  అవమాన  భారంతో కుంగిపోయాడు.  జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  మూడు రోజుల తరువాత అతని శవం నదిలో తేలడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

తన కొడుకు ఫిజిక్స్ పరీక్ష చాలా బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో... తండ్రి  హిలాల్ అహ్మద్ గిల్కర్‌  ఈ వ్యవహారాన్ని  అంతటితో వదిలేయలేదు.  పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎంతో ప్రతిభావంతుడైన తన కొడుకు  ఫెయిల్  అయ్యే అవకాశమే లేదని, ఎక్కడో తప్పు దొర్లిందని భావించారు. రీవాల్యుయేషన్  కోసం టెక్నికల్ బోర్డుకు లేఖ రాశారు.  అయితే  ఆ వాల్యుయేషన్‌లో  అద్నాన్ పాస్ అవ్వడమే  కాదు...48 అత్యధిక మార్కులు సాధించాడు.  ఫస్ట్  సెమిస్టర్ లో 70 శాతం మార్కులతో క్లాస్‌లో టాపర్‌గా నిలిచాడు. అయితే  విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నాలుగు నెలల తరువాత  రాష్ట్ర టెక్నికల్  బోర్డు  ఈ విషయాన్ని ప్రకటించింది. తప్పయిందంటూ  నాలిక్కరచుకుంది.

అయితే   పొరపాటు జరిగిందంటూనే మరోవైపు యూనివర్శిటీలలో ఇలాంటి తప్పులు జరగడం మామూలే అని  బోర్డు వ్యాఖ్యానించడంపై హిలాల్ అహ్మద్ గిల్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులే తన కొడుకును  హత్య చేశారని అద్నాన్ తండ్రి ఆరోపిస్తూ, బాధ్యులను గుర్తించి కఠినంగా  శిక్షించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement