
మా విమానం మోదీ ఫ్రీ గా వాడుకోలేదు..
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదాని గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ కాంగ్రెస్ నేత జై రాం రమేష్ తాజా విమర్శలపై స్పందించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని, తమకు స్పెషల్ ట్రీట్ మెంటే ఏమీ లేదని వివరణ ఇచ్చారు. తమ విమానాన్ని ప్రధాని ఉచితంగా వాడుకోలేదని వెల్లడించిన ఆయన కాంగ్రెస్ నేతలు జీఎంఆర్ విమానాలను వాడుకోలేదా అని ప్రశ్నించారు. నెహ్రూ గాంధీ కుటుంబం పాలిస్తున్న కాంగ్రెస్ విమర్శల వెనుక పెద్ద రాజకీయమే ఉందని ఆరోపించారు. వాస్తవాలకు దూరంగా జై రాం రమేష్ ఆరోపణలు గుప్పించారన్నారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
అదానీ గ్రూపుపై విధించిన 200 కోట్ల జరిమానాను ఉపసంహరించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని గౌతం వివరించారు. సునీతా నరైన్ నివేదిక తర్వాత యూపీఏ ప్రభుత్వం తమ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని అయితే దానికి తాము సమాధానమిచ్చామని తర్వాత ప్రభుత్వం (యూపీఏ) ఏమీ చేయాలో నిర్ణయించలేకపోయిందని విమర్శించారు.
జైం రాం రమేష్ ఆరోపించినట్టుగా చత్తీస్ ఘడ్ లోని అటవీ ప్రాంతాన్ని మైనింగ్ కోసం ఇచ్చిన కంపెనీ తమకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. అది రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన కంపెనీ అనీ, మైనింగ్ కాంట్రాక్టర్ గా తమను ప్రభుత్వం ఎంచుకుందని వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రబుత్వం హయాంలోనే ఈ ఒప్పందం జరిగిందనీ, దీనికి అనుమతి ఇచ్చిందని జై రాం రమేషే నని చెప్పుకొచ్చారు. ఇపుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. పిటిషనర్ వరుసగా నాలుగు పిల్స్ వేశాడని.. కానీ ఒకటి కూడా ఆ ప్రాంతంలో కమ్యూనిటీ కానీ, దీని వల్ల నష్టపోతున్న వారుగానీ వేయలేదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయంగా మోటివేట్ చేశాయని ఆరోపించారు. అయినా అక్కడ అభివృద్ధిజరగడం తమకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతోందన్నారు. తాము ఎలాంటి నిబంధనల అతిక్రమణకు పాల్పడలేదని వివరించారు.
ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని గౌతం అదాని వ్యాఖ్యానించారు. రాజకీయ వివాదాలలోకి రావడం తమకు ఇష్టంలేదనీ, కార్పొరేట్ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు అనవసరంగా కార్పొరేట్లను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ఇది దేశానికి మంచి కాదని వ్యాఖ్యానించారు. తాము రాజకీయ చదరంగంలో పావులు కాదలుచుకోలేదని ఆయన చెప్పారు. తాము రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తున్నామనీ, గుజరాత్,మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకుండా మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదని గౌతం ఆదాని, పేర్కొన్నారు.