న్యూఢిల్లీ: తన సొంత కార్యాలయంలోనే పురుషుల నుంచి అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నానని ఓ ఐఏఎస్ అధికారిణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చాంబర్‌లోని పురుషులు తనపట్ల అనుచితంగా వ్యవహరించారని, పరిధికి మించి ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన వర్షా జోషీ ఈమేరకు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఆకతాయిల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఎగతాళి వ్యాఖ్యల గురించి ఓ మహిళ ట్విటర్ వేదికగా వర్షా జోషి దృష్టికి తీసుకొచ్చారు. ‘ఈ వీధి గుండా వెళ్లడం ఏ మహిళకైనా చాలా కష్టం. ఇక్కడ కూచున్న పురుషులు రోజంతా అదే పనిగా మహిళలను చూస్తూ.. హుక్కా పీలుస్తూ.. పేకాట ఆడుతూ ఉంటారు. దీని గురించి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయమై దయచేసి చర్య తీసుకోండి’ అని ఓ మహిళ వర్షా జోషిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నిజానికి పోలీసులు చర్య తీసుకోవాల్సిన అంశమే కానీ. ఉత్తర భారతమంతా నిరంతరం మహిళలు ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. నా ఆఫీస్ చాంబర్‌లోనే నేను అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నాను. పురుషులు తమ పరిధికి మించి ప్రవర్తించారు. వారు ఏం చేస్తున్నదీ వారికి అర్థం కావడం లేదు. దీనికి పరిష్కారాలు ఏమున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న వేధింపులను చాటుతున్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్‌పై స్పందించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జయప్రకాశ్.. ఈ విషయమై వర్షా జోషితో మాట్లాడి.. ఆమె ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చిందో వాకబు చేస్తానని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మహిళలకు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సాక్షాత్తూ ఆఫీసులోనే.. మహిళా ఐఏఎస్ సంచలన ట్వీట్
Published Fri, Sep 27 2019 8:32 AM | Last Updated on Fri, Sep 27 2019 8:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment