బాధితులకు సృజనాత్మక సహాయం!
మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. తమిళనాడులో వర్షం, వరద బాధితులను జనం ఆదుకుంటున్న తీరు చూస్తే సరిగ్గా అదే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతి త్వరగా బాధితులను ఎలా ఆదుకోవచ్చన్న విషయాన్ని ఆలోచించి ఆ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కొందరు డబ్బు, ఆహారం వంటివి అందిస్తుంటే...మరి కొందరు ఉడతాభక్తిగా తమ సృజనను ఉపయోగించి, స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. వరద ముప్పు నుంచి బాధితులను ఒడ్డున పడేయడమే కాక... సౌకర్యాలను కల్పించి ఆదుకుంటున్నారు.
ఇళ్ళలోసైతం నీరు చేరిన పరిస్థితుల్లో వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు పడవలను అందుబాటులోకి తెచ్చినా... అవి లేని ప్రాంతాల్లో స్థానికంగా, సులభంగా దొరికే డ్రమ్ములు, వెదురు కర్రలను వినియోగించి కొందరు సాయపడుతున్నారు. ఇళ్లు కూలి ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోడానికి వారికి వెదురుతో గుడిసెలు కట్టి పునరావాసం కల్పిస్తున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డవారికి 'సేలం సిటిజెన్స్ ఫోరమ్' ఈ వెదురు ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. 96 చదరపు అడుగుల వైశాల్యం, సోలార్ లైట్లతో నిర్మించే ఈ ఇంట్లో నలుగురు నివాసం ఉండొచ్చు.
అలాగే కరెంటు అందుబాటులో లేని ప్రదేశాల్లో.. ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఛార్జింగ్ చేసేందుకు కొందరు తమ సృజనను వినియోగిస్తున్నారు. సిల్వర్ నాణేలు, బ్యాటరీలు అందుబాటులోకి తెచ్చి మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారు. అలాగే చీకట్లో దీపాలుగా కొవ్వొత్తులకు బదులు క్రేయాన్స్ స్టిక్స్ ను అందిస్తున్నారు. ఇవి కనీసం ఇరవై నిమిషాలపాటు నిలకడగా వెలగడంతో బాధితులకు తక్షణ అవసరం తీరుతోంది. మరోవైపు వరద కారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఔషధ మూలికలు, ఆకులతో తయారుచేసిన సిద్ధ వైద్యానికి సంబంధించిన నీలవెంబు కషాయాన్నిబాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక బ్యాంకుల్లో బ్యాలెన్సులున్నా డబ్బు తీసుకునేందుకు ఏటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న వారి కోసం కొన్ని బ్యాంకులు మొబైల్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ అవసరానికి డబ్బును అందిస్తున్నాయి.