సాక్షి, చెన్నై: ఇంకెంత కాలం జాప్యం చేస్తారు..? తీర్మానంపై నిర్ణయం వెలువడేదెప్పుడో? అని రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదల వ్యవహారంలో రాజ్‌భవన్ తీరుపై మద్రాసు హైకోర్టు అసంతప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా రాష్ట్రగవర్నర్ చేస్తున్న జాప్యంపై హైకోర్టు బుధవారం స్పందించడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా ఏడుగురి ఉరి శిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. ఆ శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నింథితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్ భవన్‌కే పరిమితం అయింది. దీంతో తమను విడుదల చేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది.
ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద విడుదల ఆధార పడి ఉన్నది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరిస్తూ, దీని విలువను ‘సున్న’ గా పరిగణించాలని వాదించడం చర్చకు దారి తీసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు పలు మార్లు సిఫారసు చేస్తూ వస్తున్నా, స్పందన అన్నది కరువే. ఈ తీర్మానం చేసి రెండేళ్లు కావస్తున్నా, ఇంత వరకు రాజ్ భవన్ నుంచి తీర్మానం ఆమోదం లేదా తిరస్కరణ అన్న నిర్ణయం కూడా వెలువడ లేదు. మనస్తానికి లోనైన నళిని జైలులో ఆత్మహత్యాయత్నం కూడా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో జాప్యంపై హైకోర్టు సైతం అసంతప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
జాప్యంపై అసంతప్తి..
రాజీవ్ కేసు నిందితుల్లో ఒకడైన పేరరివాలన్‌కు 90 రోజులు పరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తల్లి అర్బుదమ్మాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కపాకరణ్, వేలుమణి బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. ఇప్పటికే 2017, 2019లో పేరరివాలన్‌కు పెరల్ మంజూరు చేసి ఉన్నట్టు, ప్రస్తుతం చేసుకున్న విజ్ఞప్తి పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం తరపున వాదన కోర్టుకు చేరింది. ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ, రాజీవ్ కేసు నింథితుల విడుదల తీర్మానం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ తీర్మానం మీద నిర్ణయంలో జాప్యం ఎందుకో అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం జాప్యం చేస్తారోనని పేర్కొంటూ, అసంతప్తిని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు.
ఈ తీర్మానం మీద ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా తుంగలో తొక్కి పెట్టి ఉండటం మీద అసహనం వ్యక్తంచేస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వం, మంత్రి వర్గం తీర్మానం మీద ఏదో ఒక నిర్ణయం ప్రకటించడంలో ఇంకెంత కాలం జాప్యం చేస్తారో? అని ప్రశ్నించారు. రాజకీయ శాసనాల మేరకు కీలక పదవిలో ఉన్న వారి మీద ఉన్న నమ్మకంతో నిర్ణయానికి గడువు అన్నది విధించ లేదని, దీనిని ఆసరగా చేసుకుని జాప్యం చేయడం శోచనీయమని అసంతప్తిని వ్యక్తం చేశారు.
ఆ తీర్మానం ఎంత వరకు వచ్చిందో అన్న అంశంతో పాటుగా పెరోల్ విషయంగా వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29వ తేదికి వాయిదా వేశారు. కాగా, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ తీర్మానం ఆమోదం లేదా, తిరస్కరణ విషయంలో గవర్నర్ స్పందించేనా, రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చేనో అన్న ఎదురు చూపులు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment