‘పాల్ఘర్’ పాలన షురూ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో 36వ జిల్లా అవతరించింది. ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారికంగా ప్రారంభించారు. దీంతో స్థానికుల 29 యేళ్ల కల నిజమైనట్లయ్యింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు (పాల్ఘర్, వసాయి, డహాణూ, జవ్హార్, మోఖాడా, విక్రమ్‌గఢ్, తలాసరీ, వాడా) తాలూకాలున్నాయి. దీంతో ఠాణే జిల్లాలో ప్రస్తుతం ఏడు (ఠాణే, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్, అంబర్‌నాథ్, ముర్బాడ్, భివండీ, షాపూర్) తాలూకాలే మిగిలాయి.
పాల్ఘర్ జిల్లా ఏర్పాటును జవార్, విక్రమ్‌ఘడ్, తలాసరి, మోఖాడా తదితర తాలూకాలోన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి సంబంధించి నల్లజెండాలను కూడా ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. ఇది మినహా జిల్లా అవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్ఘర్ సెషన్‌కోర్టు సమీపంలోని సేల్స్‌టాక్స్ నూతన భవనంలో జిల్లా కార్యాలయాన్ని పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. వర్షం కారణంగా పాల్ఘర్‌కు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్ జిల్లా అవిర్భావోత్సవ కార్యక్రమం జాప్యం కాకుండా ఉండేందుకు రైలుమార్గాన్ని ఎంచుకున్నారు.
దీంతో ఆయన బాంద్రా-వాపి షటిల్ రైల్లో పాల్ఘర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మళ్లీ పాల్ఘర్ రైల్వేస్టేషన్ నుంచి గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్, వసంత్ డావ్కరే, జిల్లా ఇంచార్జీ మంత్రి గణేష్ నాయిక్‌లతోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాల కిందటే ఠాణేను విభజించి, పాల్ఘర్ లేదా జవార్ జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ అధికారికంగా 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న శరద్‌పవార్ జిల్లా విభజన అవసరమని చెప్పారు.
రాజకీయంగా...
ఠాణే జిల్లా విభజన అనంతరం కూడా ఠాణే జిల్లానే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జిల్లా విభజన అనంతరం జిల్లా విస్తరణ, క్షేత్ర విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఠాణే జిల్లా కంటే పాల్ఘర్ పెద్ద జిల్లాగా అవతరించింది. రాజకీయపరంగా పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఠాణేకే పెద్దపీట వేశారు. పాత జిల్లాలో నాలుగు లోకసభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. కాని విభజన అనంతరం పాల్ఘర్ జిల్లాలో కేవలం ఒక లోకసభ (పాల్ఘర్) మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే ఠాణేలో మాత్రం మూడు లోక్‌సభ (ఠాణే, భివండీ, కళ్యాణ్), 18 అసెంబ్లీ నియోజకవర్గాలుండనున్నాయి.