
నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది.
న్యూఢిల్లీ: నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. బుధవారం రాత్రి 10:42 గంటలకు నోయిడాలో భూ ప్రకంపనలకు భయాందోళనలతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. దీని తీవ్రతతో ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి. 3.8 కిలోమీటర్ల లోతు వరకు ఈ ప్రభావం ఉందని ఎన్‌సిఎస్ వెల్లడించింది. అయితే ప్రాణనష్టం, ఆస్తినష్టం లాంటివి జరగలేదని నివేదించింది. నాలుగు రోజుల క్రితం మే 29న ఢిల్లీ సహా రోహతక్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఒక్క రోజులోనే ఢిల్లీ పరిసరాల్లో వరుసగా భూమి కంపించగా, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 4.5, 2.9గా నమోదైంది. అంతేకాకుండా ఏప్రిల్ 12 నుంచి వరుస భూకంపాలతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.