‘కొలువు’దీరే సమయమాయే..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో బీజేపీ మంత్రుల కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నాగపూర్‌లో ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం ఉదయం ముంబైకి చేరుకుంటారు. ఆ రోజు తన సహచరులకు క్యాబిన్లు, సమావేశాలు జరిపేందుకు చాంబర్లు, ప్రభుత్వ నివాస గృహలు కేటాయిస్తారు. అనంతరం క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆదివారం తన సహచరులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. కాని వారు ఇప్పటివరకు పదవీబాధ్యతలు స్వీకరించలే దు.
గత శుక్రవారం కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫడ్నవిస్ తన మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవా హామీ చ ట్టాన్ని అమలులోకి తెచ్చి వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు. గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే, సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి దిలీప్ కాంబ్లే జవ్‌ఖేడా గ్రామానికి వెళ్లి బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ముండే పర్లీకి, కాంబ్లే పుణే ఇలా తమతమ నియోజక వర్గాలకు వెళ్లిపోయారు.
రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కార్తీక ఏకాదశి పూజల నిమిత్తం పండర్‌పూర్ వెళ్లి అటునుంచి తన నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ చంద్రాపూర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. సహకార మంత్రి చంద్రకాంత్ పాటిల్ పశ్చిమ మహారాష్ట్రలో, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావరా తమ నియోజక వర్గం పర్యటనలో ఉన్నారు. విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే, పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా, సహాయమంత్రి విద్యా ఠాకూర్ ముంబైలో ఉన్నారు. కాగా, బుధవారం వీరందరికీ క్యాబిన్లు, చాంబర్లు కేటాయించగానే విధులు చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక దృష్టంతా బంగ్లాలపై..
క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారోత్సవం, శాఖల కేటాయింపు పూర్తికావడంతో ఇక మంత్రుల దృష్టి ప్రభుత్వ బంగ్లాలపై పడింది. తమకు నచ్చిన బంగ్లా కేటాయించాలని కోరుతూ పైరవీలు చేయడం అప్పుడే ప్రారంభించారు. అత్యధిక శాతం మంత్రులు రామ్‌టెక్ బంగ్లానే ఇష్టపడుతుండటం విశేషం. అయితే ఈ బంగ్లాను ఎవరికి కేటాయించాలనేది సీఎం నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఫడ ్నవిస్ సీఎం అధికార నివాసం ‘వర్షా బంగ్లా’లోకి మారడం దాదాపు ఖాయమైంది.
ఏక్‌నాథ్ ఖడ్సేతోపాటు వినోద్ తావ్డే, సుధీర్ మునగంటివార్, పంకజా ముండే తదితర కీలక నాయకులు రామ్‌టెక్ బంగ్లాను ఇష్టపడుతున్నారు. వీరిలో ఎవరికి ఆ బంగళా దక్కుతుందో తెలియదు. అలాగే ప్రకాశ్ మెహతా దేవగిరి, విష్ణు సావరా చిత్రకూట్ బంగ్లా కావాలని ఫడ్నవిస్‌తో పైరవీలు చేస్తున్నారు.
అయితే సుమారు 19 మంది మాజీ మ్రంతులు తమ ప్రభుత్వ బంగళాలను ఇప్పటివరకు ఖాళీ చేయకపోవడం గమనార్హం. వారు ఖాళీ చేస్తేకాని కొత్త మంత్రివర్గ సభ్యులకు సదరు బంగళాలను కేటాయించడం సాధ్యం కాదు.