న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎమ్ డి) తెలిపింది. జూన్ 1 నాటికి కేరళకు చేరుకో్వాల్సిన పవనాలు ఆలస్యంగా ఏడో తేదీన తాకే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవనున్నాయి.
గత 11ఏళ్లుగా నైరుతి ఆగమనాన్ని వాతావరణ శాఖ సరిగ్గా అంచనా వేస్తోంది. ఈ కొద్ది రోజులు ఆలస్యమవడం పెద్ద విషయమేమీ కాదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ తెలిపారు. రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశంలో మరిన్ని వర్షాలు కురిసి ప్రజలకు వేడిమి నుంచి కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాథోర్ వెల్లడించారు.