బీజేపీని వీడాలనుకున్న ముండే!
ముంబై: ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే గురించి ఆసక్తికర విషయం ఒకటికి బయటికి వచ్చింది. బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని భావించిన ముండే అప్పట్లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అలాంటి పని చేయవద్దని, డిమాండ్లన్నీ త్వరలోనే నెరవేరుతాయంటూ ఎన్సీపీ అధిపతి, ముండే స్నేహితుడు కూడా అయిన శరద్ పవార్ ఆయనకు నచ్చజెప్పారు. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ ఈ సంగతి వెల్లడించారు. సేన అధికార పత్రిక సామ్నాలో రావుత్ రాసిన చిన్నవ్యాసంలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
సామ్నా కథనం ప్రకారం.. ముండే అప్పట్లో బీజేపీపై అసంతృప్తితో ఉండేవారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాలా వద్దా చెప్పాలని కోరుతూ పవార్‌ను సంప్రదించారు. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయినప్పుడు కూడా ముండే రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చింది. శరద్ పవార్, గోపీనాథ్ ముండే రాష్ట్రంలో సీనియర్ నాయకులేగాక, ఎంతో జనాదరణ పొందారు. ఇద్దరి మధ్య ఎంతోకాలంగా సాన్నిహిత్యం ఉంది. పవార్ మాదిరిగానే ముండేకు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో స్నేహితులు ఉండేవారు.
ముండేకు శాసనసభలో నివాళులు అర్పించిన సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ పాండురంగ్ ఫుండ్కర్ కూడా ఆసక్తికర విషయం చెప్పారు. తన బావ ప్రమోద్ మహాజన్ 2006లో మరణించిన తరువాత పార్టీలో ముండేకు స్థానం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. అందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరాలని భావించారని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధపడిందని పాండురంగ్ వివరించారు.