న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే ఎస్పీజీ చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజకీయ కక్షతోనే చట్ట సవరణ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను హోం మంత్రి తిరస్కరించగా, ఇదే అంశంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతపై ఆలోచన చేసిందని, ఒక్క గాంధీ కుటుంబం గురించి మాత్రం కాదని స్పష్టం చేశారు.
రాజకీయ కక్షతో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోదని, గతంలో కాంగ్రెస్ పార్టీ నే అలాంటి నిర్ణయాలు అనేకం తీసుకుందని విమర్శించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ, మన్మోహన్ సింగ్‌ల ఎస్పీజీ భద్రతపై సమీక్షలు జరిపినప్పుడు ఎలాంటి చర్చ జరగలేదని, ఆయన అన్నారు. అయితే హోం మంత్రి సమాధానంపై సంతృప్తి చెందడం లేదంటూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
ప్రధాని, కుటుంబ సభ్యులకు మాత్రమే..
‘ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు’ అని అమిత్ షా వివరించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఆగంతకుల చొరబాటును ప్రస్తావిస్తూ.. నల్లటి టాటా సఫారీ వాహనంలో రాహుల్ వస్తారని ప్రియాంకకు సమాచారం ఉందని, కానీ మీరట్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అదే వాహనంలో రావడంతో సిబ్బంది లోనికి అనుమతించారన్నారు. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment