హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో ఉధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది
న్యూఢిల్లీ/చండీగఢ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ప్రభావంతో వరద పోటెత్తి కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల దెబ్బకు వాగులు, వంకలన్నీ ఏకమై ప్రవహిస్తూ ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అలాగే జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బద్రినాథ్, కేదర్‌నాథ్, యమునోత్రికి వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వానహదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో చాలా ఇళ్లతో పాటు మనాలీలోని ఓ పర్యాటకుల బస్సు కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోవింద్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రా, కులూ, ఛంబా జిల్లాలో ఐదుగురు చనిపోయారన్నారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవసమాధి అయ్యారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment