రష్యన్ సినిమాకు ‘గోల్డెన్ పీకాక్’
పణజి: భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో(ఇఫీ) రష్యన్ సినిమా ‘లెవియాథన్’కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. రైతు ఆత్మహత్య నేపథ్యంతో సాగే మరాఠీ సినిమా ‘ఏక్ హజారాచీ నోట్’ ఉత్తమ చిత్రంగా సెంటినరీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
45వ ఇఫీ అవార్డుల కార్యక్రమం ఆదివారమిక్కడ ముగిసింది. తన భూమికోసం పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కిన ‘లెవియాథన్’ హీరో అలెక్సెల్ సెరెబ్రియాకోవ్, సర్కస్‌లో పనిచేసే మరుగుజ్జుల జీవితాన్ని చిత్రించిన బెంగాలీ సినిమా ‘చోటోదర్ చోబీ’ నటుడు దులాల్ సర్కార్‌లకు ఉత్తమ నటుడి పురస్కారాన్ని సంయుక్తంగా అందించారు.
వారికి దీన్ని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, నటుడు జాకీ ష్రాఫ్‌లు ప్రదానం చేశారు. క్యూబన్-స్పానిష్ సినిమా ‘బిహేవియర్’లో నటించిన క్యూబన్ నటి ఎరీనా రోడ్రిగ్, ఇజ్రాయెల్ సినిమా ‘కిండర్‌గార్టెన్ టీచర్’ నటి సరిత్ లారీలు ఉత్తమ నటి పురస్కారాన్ని సంయుక్తంగా అందుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, నటుడు నానా పటేకర్‌లు అవార్డు అందించారు. ‘కిండర్‌గార్టెన్ టీచర్’ దర్శకుడు నదాఫ్ లాపిడ్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. హాంకాంగ్ దర్శకనిర్మాత వాంగ్ కారవాయ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.