‘ నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న నా కూతురి సెల్ఫీని నిన్న డెలీట్ చేశాను. ఆ ఫొటోలో తను అందంగా లేదంటూ ఆమె క్లాస్‌మేట్ ఏ ఝా అనే విద్యార్థి కామెంట్ చేశాడట. అంతేగాక స్నేహితులందరితో కలిసి ఏడిపించాడట. అందుకే తన కన్నీళ్లు చూడలేక నేను ఆ ఫొటోను డెలీట్ చేశాను. కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. నేను అలా చేయడం వల్ల అతడు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే మళ్లీ అదే ఫొటో పోస్ట్ చేస్తున్నా’ అంటూ కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన కూతురిని అవమానించిన వ్యక్తికి స్మృతి కౌంటర్ ఇచ్చిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తనే జోయిష్ ఇరానీ..
స్మృతి కూతురు అందవిహీనంగా ఉందంటూ తోటి విద్యార్థులు చేసిన కామెంట్లపై స్పందించిన ఆమె..‘ చూడండి మిస్టర్ ఝా.. నా కుమార్తె క్రీడాకారిణి, లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకుంది. తను నా ముద్దుల తనయ. ఎంతో అందంగా ఉంటుంది. తనను ఎంతగా ఏడిపిస్తారో ఏడిపించండి. మీ అందరికి దీటుగా బదులిస్తుంది. ఎందుకంటే తను జోయిష్ ఇరానీ. ఆమె తల్లినైనందుకు గర్విస్తున్నా’ అని తన కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. అదే విధంగా ఇలాంటి చెత్త కామెంట్లకు ఎవరూ భయపడవద్దని, అందం అంటే రూపం మాత్రమే కాదని పేర్కొన్నారు. వ్యక్తిత్వంతోనే జీవితంలో అన్నింటినీ సాధించగలుగుతామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో..‘తను మీ కూతురు. అందంగా ఉండటమే కాదు ధైర్యవంతురాలిగా కూడా ఉండాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment