
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
హక్కుల ఊసెత్తితే జైలే!
⇒ ఛత్తీస్‌గఢ్ జైల్లో మూడు నెలలుగా తెలంగాణ హక్కుల నేతల బృందం
⇒ ఎన్‌కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం..
⇒ భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైల్లో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్)కు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24న ఛత్తీస్‌గఢ్ బయల్దేరింది. అయితే 26వ తేదీన వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్బంధించారు. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి సుక్మా జైలుకు పంపింది. బెయిల్ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్‌ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువుల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది.
ఎవరు వారు?
ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్నవారిలో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య (45), హైదరాబా ద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజాం ఉన్నారు. నిజానికి.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25న భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి.
వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ.లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తు న్నారని అభియోగాలు మోపారు. బస్తర్‌లో హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి.
ప్రొఫెసర్లు, జర్నలిస్టులకు వేధింపులు
డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్ తదితరులపై సుక్మా జిల్లాలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4న రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్‌సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సే, గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణ్యం, టీవీ విలేకరి ప్రభాత్సింగ్, పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్‌లను కూడా పోలీసులు ఇలాగే వేధించారు. కొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను వీడి వెళ్లిపోయారు.
13 ఏళ్ల బాలుడి ‘ఎన్‌కౌంటర్’ కేసు
కిందటేడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ‘ఎన్‌కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. టీడీఎఫ్ నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్‌కౌంటర్’ ఘటనను కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న ఈ బాలుడిని పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్‌పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్‌పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 25, 26 తేదీల్లో శవపరీక్ష చేశారు.
ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్ బృందాన్ని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే జగదల్‌పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ.10 లక్షల కొత్త నోట్లు మార్చి ఇచ్చారని, దంతెవాడ అడవుల్లో ఆమె మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ బస్తర్ ఎస్‌పీ ఆర్.ఎన్.దాష్ ఆరోపించారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. ఆమె గదిని సోదా చేయాలని, విచారణకు స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవ్యాది కావడం గమనార్హం!
ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టుల ర్యాలీ
మల్కన్‌గిరి: మహిళా దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా అడవిలో బుధవారం మహిళా మావోయిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు స్థానిక గిరిజన మహిళలతో కలిసి భారీగా ప్రదర్శన నిర్వహించారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని, గిరిజన మహిళల్లో చైతన్యం రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా జననాట్యమండలి ఆధ్వర్యంలో గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆత్మరక్షణ విధానాలపై వారికి అవగాహన కల్పించారు.