- పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని సుపరిపాలనా దినోత్సవ సందేశం
న్యూఢిల్లీ: ‘పౌరుడికే తొలి ప్రాధాన్యం’ అన్న పరిపాలనా మంత్రం ప్రాతిపదికగా సామాన్య పౌరుల సంక్షేమం లక్ష్యంగా గత ఏడు నెలలుగా తమ ప్రభుత్వం పనిచేసిందని, పారదర్శకమైన, జవాబుదారీతనంతో పరిపాలనను ప్రజలకు అందించేందుకే తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాన్య పౌరుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 90వ జన్మదినాన్ని ‘సుపరిపాలనా దినం’గా పాటిస్తున్న సందర్భంగా ప్రధాని గురువారం ఒక సందేశం ఇస్తూ, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన పారదర్శక పాలనను అందిస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ఈమేరకు ఆదేశాలు వెళ్లాయని, తమ పరిధిలోకి వచ్చే రంగాలను మరింత సరళీకరించి, హేతుబద్ధంగా విధానాలు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించామని మోదీ తెలిపారు. దేశ ప్రగతికి సుపరిపాలన కీలకమైనదని, ప్రభుత్వ పరిపాలనను పౌరులకు చేరువగా తీసుకెళ్లి, తద్వారా పాలనా ప్రక్రియలో పౌరులను కూడా క్రియాశీలక భాగస్వాములుగా చేయాలన్నదే తన ఆశయమని మోదీ తెలిపారు.
పరిపాలనను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే mygov.in వంటి వెబ్‌పోర్టల్స్‌ను ప్రారంభించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వంలో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్ మార్గంలో అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ ఇండియా పథకం దోహదపడుతుం దన్నారు.
టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్
దేశీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా పర్యాటకుల కోసం హెల్ప్‌లైన్ నంబర్(1800-111-363)ను కేంద్రం నేడు ప్రారంభించనుంది. అలాగే ‘వెల్‌కమ్’ కార్డును ఆవిష్కరించనుంది. వేధింపులు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు పర్యాటకులు ఈ నంబర్‌ను సంప్రదిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు.
త్వరలో దుకాణాల్లోనూ మినీ ఎల్‌పీజీ
వినియోగదారులకు వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సులభంగా లభ్యమయ్యేందుకు 5కేజీల మినీ సిలిండర్లను త్వరలో ఎంపికచేసిన పెట్రోల్ బంకులు, దుకాణాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. గురువారం జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఢిల్లీలో పునఃప్రారంభించారు.