యోగి ఎఫెక్ట్: టీచర్లకు ఇక బడితపూజే!
ఇన్నాళ్లూ టీచర్ల చేతుల్లో పిల్లలకు బడితపూజ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని స్కూళ్లలో నాణ్యత మరీ నాసిగా ఉంటోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఇక వాళ్ల పని పట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సమయానికి రావడంతో పాటు బాగా చదువు చెప్పాలని ఆయనో కొత్త నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల ఫొటోలను స్కూలు గోడల మీద అతికించాలని ఆదేశించారు. ఆయా టీచర్లంతా సమయానికి స్కూళ్లకు వస్తున్నారో లేదో చెప్పాలని విద్యార్థులకు వివరిస్తున్నారు. తన సొంత ఊరైన గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్ల వరకు అన్నింటిలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, అప్పుడే టీచర్ల సమయపాలన గురించి విద్యార్థులను కూడా ప్రశ్నిస్తారని చెప్పారు.
కొంతమంది టీచర్లు తమకు బదులుగా వేరేవాళ్లను తక్కువ జీతాలు ఇచ్చి స్కూళ్లకు పంపి, వాళ్లతో చదువు చెప్పిస్తున్నారని, వాళ్లు మాత్రం ఇళ్ల దగ్గర కూర్చోవడమో, వేరే వ్యాపారాలు చేసుకోవడమో జరుగుతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇలాంటిది ఇకమీదట కొనసాగేది లేదని, అందుకే టీచర్లందరి ఫొటోలను గోడమీద అతికించాలని చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో లేదో తెలుసుకోడానికి తాను ఏ సమయంలోనైనా వాళ్ల ల్యాండ్ లైన్లకు ఫోన్ చేస్తానని చెప్పారు. అలాగే లాండ్ మాఫియా పని పట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.