దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్‌కల్చరల్(నిజామాబాద్‌అర్బన్): ముథ్కేడ్ – మనోహరాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులను దశల వారీగా నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 780 కి.మీల మేరకు ఉన్న సికింద్రాబాద్ – మన్మాడ్, ముథ్కేడ్ – ఆదిలాబాద్ లైన్లకు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు ఇప్పటికే మంజూర్యయని అన్నారు. నిజామాబాద్ వైపు మరిన్ని రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న జీఎం నిజామాబాద్ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. హెల్త్ యూనిట్, రైల్వే క్వార్టర్స్ కాలనీ, రైల్వే స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు.
ఆలాగే ఆర్‌పీఎఫ్ స్టేషన్‌లోని వంట గదిని పరిశీలించిన జీఎం.. ఆధునికీకరించిన రన్నింగ్ రూంలో డ్రైవర్లు, గార్డులతో కలిసి భోజనం చేశారు. లోకో పైలట్ల కోసం ఓం శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన మెడిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్, మాధవనగర్, నవీపేట, డిచ్‌పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని జీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా అందిస్తే అవసరమైన చోట రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్‌వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జీలు (ఆర్‌యూబీ) నిర్మిస్తామని చెప్పారు. అవసరమున్న లెవల్ క్రాసింగ్‌ల వద్ద అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామన్నారు.
జీఎంను కలిసిన ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ మీదుగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని, పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్‌రావు, నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్ట్రీస్ ప్రతినిధులు తదితరులు జీఎంకు వినతిపత్రాలు సమర్పించారు. డబ్లింగ్ లైన్ పనులు త్వరగా చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోరిన విధంగా నిజామాబాద్ మీదుగా పలు రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ముంబై నుంచి నిజామాబాద్ వరకు నడుస్తున్న లోకమన్య తిలక్ రైలును, కాచిగూడ నుంచి నిజామాబాద్ వరకు నడుస్తున్న రైళ్లను కరీంనగర్ వరకు పొడిగిస్తామన్నారు.
మార్చిలోగా వైఫై..
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో మార్చిలోపు వైఫై సదుపాయాన్ని ప్రారంభిస్తామని వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఈ రైల్వేస్టేషన్‌లో అదనంగా రెండు ప్లాట్‌ఫామ్స్‌ను నిర్మిస్తామని, నాలుగు ఎస్కలేటర్స్, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు జీఎం స్టేషన్ ఆవరణలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లోకో పైలెట్, గార్డ్‌లతో కలిసి జీఎం భోజనం చేశారు. డీఆర్‌ఎం ఆరుణ్‌కుమార్ జైన్, ఆయా విభాగాల అధికారులు, నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ బబ్లు మీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment