
ఏ పేరున నిను పిలువగలం!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలైన టీఆర్‌ఎస్, తెలుగుదేశం అధికారంలోకి వచ్చీ రాగానే ఇక్కడ తెలంగాణ శాసన మండలిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరుతో ప్రతిపక్షాన్ని ఖతం చేయడమే లక్ష్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు పాతర వేయడానికి సిద్ధపడ్డారని అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యకుండానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్‌పీవై రెడ్డి తెలుగుదేశానికి వలస పోవడం, మరికొందరికి కూడా ఆ పార్టీ సైగలు చెయ్యడం యోగేంద్ర యాదవ్ చెబుతున్న మూడు ప్రత్యామ్నాయాలలో దేనికిందికీ రావేమో!
డేట్‌లైన్ హైదరాబాద్
ఓ పది రోజుల క్రితం మంథన్ సంవాద్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ రాజకీయాల మీద ఒక అద్భుత ప్రసంగం చేశారు. భారత రాజకీయ చిత్రపటం మీద కొత్తగా వెలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయోగంలో ఆయన నిర్వహించిన ముఖ్య పాత్ర అందరికీ తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ విఫలమైందో విశ్లేషిస్తూనే రాజకీయాలు ఎట్లా ఉండాలో, అవి ఇప్పుడెట్లా ఉన్నాయో చక్కగా వివరించారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నది ఆయన వాదన. ఆమ్ ఆద్మీ పార్టీ సాఫల్య వైఫల్యాలను అట్లా ఉంచితే ప్రత్యామ్నాయ రాజకీయాల మీద ఆయన చేసిన విశ్లేషణను ఇటీవలే విడిపోయిన మన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోనూ, అధికార పార్టీల పోకడలతోనూ తప్పకుండా పోల్చి చూడాలి. యోగేంద్ర యాదవ్ మూడు అంశాలు చెబుతారు- రాజకీయ ప్రత్యామ్నాయాలు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, రాజకీయాలకే ప్రత్యామ్నాయాలు.
ప్రత్యామ్నాయం అంటే ఇదా!
రాజకీయ ప్రత్యామ్నాయాలంటే కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని అధికారంలోకి తేవడం, తెలుగు దేశాన్ని ఓడించి టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించడం వగైరా వగైరా. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే భ్రష్టు పట్టిపోతున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నిటికీ భిన్నంగా కొత్త రాజకీయ పార్టీలను తీసుకురావడం (ఆయన దృష్టిలో అది ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీయేనన్నది స్పష్టం). ఇక మూడవది అసలు ఈ రాజకీయాలన్నింటినీ తిరస్కరించేయడం. దాన్నే రాజకీయాలకే ప్రత్యామ్నాయాలుగా ఆయన విశ్లేషించారు. అయితే ఈ మూడవ ప్రత్యామ్నాయాన్ని ఆయన సమర్థించలేదు. ఆయనే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వారెవరూ అంగీకరించే అవకాశం లేదు.
తీవ్రమైన అవినీతి, బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం చుట్టు ముట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజకీయాలకు ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం అవసరమే నన్న చర్చ దేశమంతటా తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రయ త్నాల్లో భాగంగా కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకురావడం చూస్తూనే ఉన్నాం.
మనకోసం మరో పేరు వెతకాలి
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు ముఖ్యంగా అధికార రాజకీయాలు యోగేంద్ర యాదవ్ నిర్వచించిన మూడు ప్రత్యామ్నా యాల్లో దేనికిందికి వస్తాయి? యోగేంద్ర యాదవ్ వంటి రాజకీయ విశ్లేషకులు లేదా పండితులకు ఇప్పుడు మన రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయాలను గురించి విడమరిచి చెప్తే దానికి ఇంకో పేరు వెతికే ప్రయత్నంలో పడటం ఖాయం.
తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయితే అందుకు తోడ్పడిన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేయడానికి వెనుకాడనని కాసేపు, నూతన రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ఇంకొంత సేపు ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు చివరికి వచ్చే సరికి స్వీయ రాజకీయ అస్తిత్వం నినాదాన్ని తలకెత్తుకున్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన కొత్తలో అందరూ అనుకున్నది ఇంత కాలం ఉద్యమ సంస్థగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఆయన ఫక్తు రాజకీయ పార్టీగా మార్చబోతున్నారని. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. రాష్ట్రం సాధించుకున్నాక ఇన్నేళ్లూ పనిచేసిన వాళ్లంతా గోళ్లు గిట్లుకుంటూ కూర్చోరు. పైగా ఈ పదమూడేళ్ల పాటు టీఆర్‌ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. గెలుపు ఓటములను చూస్తున్నది కూడా.
కానీ రాష్ట్రం సాధించుకున్నాక జరుగుతున్న వ్యవహారం చూస్తే స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం అని ఎవరికైనా సులభంగా అర్థం అవుతుంది.
ఇదేం ధోరణి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలైన టీఆర్‌ఎస్, తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికలు ముగిసి, అధికారంలోకి వచ్చీ రాగానే ఇక్కడ తెలంగాణ శాసన మండలిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరు ప్రతిపక్షాన్ని ఖతం చేయడమే లక్ష్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు పాతర వేయడానికి సిద్ధపడ్డారని అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే గెలిచీ గెలవగానే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యకుండానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్‌పీవై రెడ్డి తెలుగుదేశానికి వలస పోవడం, ఆ పార్టీ ఆయనను ఆహ్వానించడమే కాక మరికొందరికి కూడా సైగలు చెయ్యడం యోగేంద్ర యాదవ్ చెబుతున్న మూడు ప్రత్యామ్నాయాలలో దేనికిందికీ రావేమో! తాము ఏ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ, హక్కు ప్రతి మనిషికీ ఉంటుంది. అయితే ఒక పార్టీ నుండి గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలోకి వలస ఏ సంస్కృతికి నిదర్శనం?
విపక్షం అంటే అసహనం
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్నట్టు, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ పడ్డారు. రేపో మాపో ఏడెనిమిది మంది నగర తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని గత రెండు వారాలుగా ప్రచారం జరుగుతున్నది. అందులో కొందరు బహిరంగంగానే మీడియా వారితో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. వీళ్లంతా బయటికి చెబుతున్నట్టు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరి పట్ల విసుగు చెంది వెళుతున్నారా? బంగారు తెలంగాణ కల సాకారం కావడం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చడానికి వెళ్తున్నారా? ఇప్పటికే వెళ్లిన వాళ్లూ ముందు ముందు వెళ్లబోయే వాళ్లు ఏ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వలస పోతున్నారో జనం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఒకాయన తన కోట్లాది రూపాయల కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఆగిపోతాయనే బెదిరింపులకు లొంగి, మరో ఆయన తాను ప్రారంభించనున్న మెడికల్ కాలేజీకి అనుమతి ఆగిపోతుందన్న భయంతోనూ వలస పోతున్నారన్న ప్రచారంలో నిజానిజాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోవుకదా!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమకారుల మీద దాడులు చేసి తీవ్రంగా కొట్టి గాయపరచి తమ అధినేత పర్యటనలకు ఆటంకాలు తొలగించిన నాడు వీరికి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకత ఎందుకు కనిపించలేదో? అట్లా తెలంగాణవాదుల మీద దాడులకు దిగిన వాళ్లు కొందరు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరి పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వెళుతున్న వారికి వారే ఆదర్శం కావచ్చు. చేరిన వాళ్లకు, చేర్చుకున్న వాళ్లకు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న సందేహం కలగకపోవడం ప్రస్తుత రాజకీయాల ప్రత్యేక లక్షణమా?
ఎందుకీ దూకుడు?
ఇంతకూ తెలంగాణలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసే కార్యక్రమం టీఆర్‌ఎస్ అధినేత ఎందుకు చేపట్టినట్టు? త్వరలో జరగవలసి ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించు కోడానికేనా? అది మాత్రమే అయి ఉండదు. రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఆ కాస్త ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలన్నది అసలు పథకంగా కనిపిస్తున్నది.
ఇక్కడయినా, అక్కడయినా అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే అయిపో తుందా? అసలైన ప్రతిపక్షం ప్రజలే అన్న విషయాన్ని పాలకులు విస్మరించిన ప్పుడు ఇట్లాంటి విన్యాసాలు చేస్తుంటారు. యోగేంద్ర యాదవ్ వంటి రాజకీయ పండితులు ఈ మార్కు రాజకీయాలను ఏమని పిలుస్తారో మరి?
దేవులపల్లి అమర్ సీనియర్ జర్నలిస్ట్