
పరవాడ(పెందుర్తి): బ్యాడ్మింటన్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది వాడచీపురుపల్లికి చెందిన కర్రి దేవిక. అంతర్జాతీయ ఖ్యాతే లక్ష్యంగా పాల్గొన్న ప్రతీ పోటీలో అద్భుత ప్రదర్శన కనబర్చుతూ అందరి మన్ననలూ పొందుతోంది. ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని అందరి మన్ననలు పొందింది. వాడచీపురుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని దేవిక. తండ్రి కర్రి రాము ఆర్టీసీ కండక్టర్, తల్లి రామలక్ష్మి గృహిణి. చిన్ననాటి నుంచి బ్యాడ్మింటన్‌పై మక్కువ. పిన్ని అపర్ణ ప్రోత్సాహంతో సాధన ప్రారంభించిన ఆమె నాలుగేళ్లుగా నైపుణ్యం పెంపొందించుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి పతకాలను సొంతం చేసుకుంటోంది.
రోజు 2 గంటల సాధన
పాఠశాల విడిచిన తరువాత దేవిక రోజూ సాయంత్రం రెండు గంటల పాటు బాల్‌బ్యాడ్మింటన్ సాధన చేస్తోంది. పోటీలకు ముందు మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తానని తెలిపింది. ఈమె రైట్ బ్యాక్ ఆడడంలో మంచి నేర్పరి.
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని..
బాల్‌బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ కీర్తి పొందాలన్నదే ఆశయం. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పరవాడ ఎంపీపీ మాసరపు అప్పలనాయుడుల ప్రోత్సాహం ఎనలేనిది. లారస్ ల్యాబ్స్ యాజమాన్యం సహకారంతో ఇండో–లంక సిరీస్‌లో పాల్గొనే అవకాశం లభించిం ది. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్‌ను దక్కించుకున్నాం. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రావు వెంకటరావు, చిరికి వెంకటరావు సహకారం అందిస్తున్నారు. – దేవిక
సాధించిన పతకాలు
– జాతీయ స్థాయి బ్యాల్‌బాండ్మింటన్ పోటీల్లో అండర్–16 విభాగంలో నాలుగు రజత పతకాలు సాధించింది.అండర్–17 విభాగంలో రెండు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు, అండర్20లో ఒక రజతం, ఒక కాంస్య పతకం, సౌత్ జోన్ పోటీల్లో రెండు బంగారు, రెండు కాంస్య పతకాలు, ఫెడరేషన్ కప్ పోటీల్లో ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
రాష్ట్రస్థాయిలో..
అండర్–17 పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు, అండర్–16లో రెండు స్వర్ణ పతకాలు, అండర్–20 విభాగంలో ఒక స్వర్ణం, జూనియర్స్ విభాగంలో స్వర్ణం, సీనియర్స్ విభాగంలో రజత పతకాలను కైవసం చేసుకుంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ గత నెల నల్గొండలో నిర్వహించిన పోటీల్లో రజత పతకం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment