ముందస్తుకు రె‘ఢీ’ : అమిత్‌ షా | BJP Amit Shah Slams On Rahul Gandhi Mahabubnagar | Sakshi
Sakshi News home page

ముందస్తుకు రె‘ఢీ’ : అమిత్‌ షా

Published Sun, Sep 16 2018 10:39 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

BJP Amit Shah Slams On Rahul Gandhi Mahabubnagar - Sakshi

ప్రజలకు అభివాదం చేస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, రాష్ట్ర నేతలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. పరిపాలన చేత కాకే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధికారాన్ని వదిలి పారిపోయారని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కళాశాల ప్రాంగణంలో శనివారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యాన ‘మార్పు కోసం – బీజేపీ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

పగటి కలలు కంటున్న రాహుల్‌బాబు 
‘రాహుల్‌ బాబకు రాత్రివేళతోపాటు పగటి వేళల్లో కూడా కలలు వస్తున్నట్లుంది. రాహుల్‌బాబ ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పీవీ నరసింహరావు, అంజయ్య వంటి నేతలకు చేసిన అవమానం ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే టీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తోంది. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనా.? అంటే మైనార్టీల రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తాకట్టు పెడతారా? ఆయా వర్గాల రిజర్వేషన్లు కట్‌ చేసి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారా’ అని అమిత్‌ షా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 

సమాధానం చెప్పాలి.. 
‘దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడేమే కేసీఆర్‌కు పరిపాలన చేతకాక ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు వెళ్తుందో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి. 2019 మే నెలలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతోనే వారు ముందస్తుకు వెళ్లారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం లభిస్తే.. తెలంగాణకు సెప్టెంబర్‌ 17న లభించింది. ఆనాడు రజాకార్లు సాగించిన హింస ఇప్పటికీ ప్రజల కళ్లలో మెదులుతోంది. అయితే తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో కేసీఆర్‌ మాత్రం ఎంఐఎం, ఓవైసీ సోదరులకు భయపడి 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. విమోచన దినాన్ని జరపలేని టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తుంది’’ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్‌ షా వెల్లడించారు. 

బీజేపీ మద్దతు లభిస్తుందనే.. 
దేశంలోని పేద ప్రజల కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చినట్లు అమిత్‌షా తెలిపారు. ఇన్సూరెన్స్‌ పథకంతో తెలంగాణ ప్రజలు ఎక్కడ బీజీపీకి మద్దతు పలుకుతారోనన్న భయంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకం అమలుచేయడానికి వెనుకంజ వేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 100 పడకల ఆస్పత్రి, మండల స్థాయిలో 30 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్న హామీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిచిపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ సర్కార్‌ ఎన్నో పనులు చేసిందన్నారు. రాష్ట్రంలోని వివిధ పథకాల కోసం మోదీ ప్రభుత్వం రూ.లక్షా15వేల కోట్లు విడుదల చేసిందన్నారు. ముద్ర లోన్, స్మార్ట్‌ సిటీ, అమృత్‌ సిటీ, హైవేల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించామన్నారు. అలాగే 5 లక్షల కుటుంబాలకు గ్యాస్‌ సిలిండర్లు అందజేశామన్నారు. 

కేసీఆర్‌ను ముందు పంపడం ఖాయం 
ముందస్తు రూపంలో వస్తున్న ఎన్నికల ద్వారా కేసీఆర్‌ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని నేరుగా ఎదుర్కోలేక మహాకూటమి పేరుతో కాంగ్రెస్, ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ ముందుకొస్తోందని విమర్శించారు. వాస్తు బాగోలేదని సచివాలయంలో అడుగుపెట్టని వ్యక్తి.. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల అక్బరుద్దీన్‌ ఓవైసీ కర్ణాటకలో మాదిరిగా ఎంఐఎం అధికారంలో వస్తుందని చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మతోన్మాద ఎంఐఎంకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే మాదాసి కురుమలను ఎస్సీలో, వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. 

పాలమూరుతో విడదీయలేని బంధం నసభా పక్ష మాజీ నేత 
బీజేపీకి పాలమూరుతో విడదీయలేని బంధం ఉందని, అందుకే ప్రతీ శుభకార్యాన్ని ఇక్కడి నుంచే మొదలుపెడుతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి తెలిపారు. పాలమూరు ప్రాంతానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు దత్తత తీసుకోవడం, కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి, ఆఖరికి కేసీఆర్‌ కూడా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించినా ఒరగబెట్టిందేమి లేదన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు, టీడీపీకి 15 ఏళ్లు, టీఆర్‌ఎస్‌కు నాలుగేళ్లు అధికారం అప్పగించిన పాలమూరు ప్రజలు ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. పాలమూరు తలాపున పారుతున్న కృష్ణమ్మను బీడు భూములకు మళ్లించి పచ్చదనం తీసుకొస్తామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదని, ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాయని నిలదీశారు. కేసీఆర్‌కు కుటుంబ పోరుతో పరిపాలన చేతకాక నాలుగేళ్లకే కుర్చీ వదిలేసి పారిపోయాడని ఎద్దేవా చేశారు. 

బీర్లు, బిర్యానీలు పంచలేదు 
జాతీయ ప్రధాన కార్యదర్శి  టీఆర్‌ఎస్‌ పార్టీ మాదిరిగా బీర్లు, బిర్యానీలు పంచడం బీజేపీ సంప్రదాయం కాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తారని బీరాలు పలికి ఆఖరికి ఐదు లక్షల మంది కూడా రాకపోయే సరికి ఆ పార్టీ బ్యాటరీ డౌన్‌ అయ్యిందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు మరోసారి ఓటేస్తే రెండున్నరేళ్లకే పారిపోతారన్నారు. ప్రభుత్వాన్ని నడపలేని నాయకత్వ లోపంతో టీఆర్‌ఎస్‌ సతమతమవుతోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏఒక్క హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేకపోయిందన్నారు. తెలంగాణలో ఏఒక్క వర్గాన్ని వదలకుండా ప్రతీ ఒక్కరినీ మోసం చేశారని విమర్శించారు. 

అంబేద్కర్‌ విగ్రహం ఏదీ? 
రాజధాని హైదరాబాద్‌ నగరంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, సీఎం సీటు ఇలా అన్ని విధాలుగా వంచించారని విమర్శించారు. ముందస్తు రూపంలో వస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌కు తెలంగాణ పౌరుషం చూపించాలన్నారు. పేరుకే బంగారు తెలంగాణ చెప్పినా.. ఈ నాలుగేళ్ల కాలంలో తాగుబోతుల తెలంగాణగా మార్చాడని దుయ్యబట్టారు. ఇటీవల ప్రకటించిన 105 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా కురుమ సామాజిక వర్గానికి కేటాయించకుండా మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

ఓటమి భయంతోనే ముందస్తుకు... 
టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ఐదేళ్లకు వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులు అప్రజాస్వామికమన్నారు. ఐదేళ్లకు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ భయపడుతున్నారని విమర్శించారు. 

కలెక్టరేట్‌ తరలింపులో ఎమ్మెల్యే పాత్ర 
జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌ పట్టణానికి నడిబొడ్డున, ప్రజలకు అందుబాటులో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ప్రోద్బలంతోనే తరలిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్‌ను తరలిస్తే పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మయూరి పార్కు, ట్యాంక్‌బండ్‌లను తానే నిర్మించానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే.. కలెక్టరేట్‌ విషయంలో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పాలమూరు వలసలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆపలేకపోయిందని ఆరోపించారు. వలసల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని, మంత్రులు వందల కోట్ల భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

అట్టర్‌ ప్లాప్‌ 
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ల అధికారాన్ని ప్రజలు ఇస్తే తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఆశీర్వదించాలని ప్రగతి నివేదన సభ పెట్టి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, ఈ సభ ద్వారా కేసీఆర్‌ ఆవేదన, రోదన అర్థమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేకపోయిందని, చేతగాక గద్దె దిగి మరోసారి అధికారం ఇవ్వాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉండి సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని, ఇలాంటి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపలేక ముందస్తు పేరుతో ప్రజల వద్దకు ఏం ముఖం పెట్టుకొని ఓట్లడిగేందుకు వెళతారని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement