సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో హడావుడిగా 41 విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) కుదుర్చుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. పీపీఏలపై శాసనసభలో సోమవారం టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)ని తప్పుదారి పట్టించి, డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. పీపీఏలపై సమీక్షతోపాటు ఇతర విధానాలతో విద్యుత్తు వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు.
హడావుడిగా 41 పీపీఏలా?
‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని బుగ్గన ప్రశ్నించారు. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్‌కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్‌కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్‌డ్ చార్జీల కింద యూనిట్‌కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి బుగ్గన వివరించారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన తెలిపారు.
విద్యుత్తు సబ్సిడీల కోసం టీడీపీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు పేర్కొని.. కేవలం రూ.1,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. దాంతో డిస్కంలు రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రూ.4,900 కోట్లు చెల్లించి డిస్కంల పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చిందని మంత్రి వెల్లడించారు. పీపీఏలపై విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడటాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టగా.. మంత్రి తిప్పికొట్టారు. కొన్ని అంశాలపై అధికారులు, నిపుణులు మాట్లాడతారని, టీడీపీ హయాంలో ఐటీ గ్రిడ్స్ కేసులో ఆర్టీజీఎస్ సీఈవో విజయానంద్, అహ్మద్‌బాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిన విద్యుత్తు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే పీపీఏలను సమీక్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మహిళా భద్రత బిల్లుపై చర్చను అడ్డుకుంటారా?
శాసనసభలో మహిళా భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా పదే పదే అడ్డు తగిలిన విపక్షసభ్యులపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధచెప్పినా వినకుండా.. విపక్ష సభ్యులు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని తప్పు పట్టారు. ప్రతిపక్షానికి బాధ్యత ఉంటే స్పీకర్‌కు ఉల్లిపాయల బాక్స్‌ను పంపిస్తారా? అని ప్రశ్నించారు. లాభాల కోసం హెరిటేజ్‌లో కేజీ ఉల్లి రూ.200కు అమ్మడం సరైనదేనా? అని నిలదీశారు.
అడ్డదారిలో పీపీఏలు ఆమోదించారు: మంత్రి బాలినేని
పీపీఏలు చేసుకోవద్దని 2017, ఫిబ్రవరి 27న అప్పటి విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టంగా చెప్పినా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పీపీఏలపై చర్చలో ఆయన మాట్లాడుతూ అప్పటికే అనుకున్న లక్ష్యం చేరుకోవడంతోపాటు పవన విద్యుత్తు ధరలు పడిపోయాయని.. దాంతో ఈఆర్‌సీకి నివేదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం మంత్రిమండలిలో ర్యాటిఫై చేసి మరీ పీపీఏలను ఆమోదించడం ఎంతవరకు సమంజసమని బాలినేని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment