
శనివారం రాత్రి జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి వస్తున్న సోనియా గాంధీ
న్యూఢిల్లీ: 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ(72) తాజాగా ఎన్నికయ్యారు. ఈ ఏడాదిలో హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్లూసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాజకీయ సవాళ్లను సోనియానే సమర్థవంతంగా ఎదుర్కోగలరనీ, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అగ్రనేత అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతిలో వరుస ఓటములు ఎదురైనా కుంగిపోకుండా కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు సోనియా విజయతీరాలకు చేర్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో సోనియా నాయకత్వం కాంగ్రెస్‌కు అత్యంత ఆవశ్యకమనీ, పలువురు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతికస్థైర్యం నింపాలంటే సోనియాగాంధీయే సరైన వ్యక్తని చెబుతున్నారు.
అధ్యక్ష ఎన్నికలు త్వరగా జరపాలి
అయితే సోనియా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై మరికొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ‘గాంధీ కుటుంబం చేతిలో అధికారం ఉన్నంతకాలం పార్టీలో నాయకత్వ మార్పు సాధ్యం కాదు. తాజా నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని నడపాలంటే గాంధీ కుటుంబమే దిక్కన్న వాదనలకు బలం చేకూరింది. ఇందులోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్లాల్సిన అవసరముంది’ అని వారంతా చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలను త్వరగా చేపట్టడంతో పాటు పార్టీ కార్యకలాపాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సీనియర్ల టైమ్ వచ్చింది..
కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన 20 నెలల్లో రాహుల్ పార్టీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేశారు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నేతలను ప్రోత్సహించారు. మూసవిధానాలను మార్చుకుని పార్టీ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన రాహుల్, గుజరాత్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితం కావడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ ఏడాది మే 25వ తేదీన రాజీనామా చేశారు. తాజాగా సోనియాగాంధీ రంగప్రవేశం నేపథ్యంలో మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, కమల్‌నాథ్, మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్, మురళీ దేవరా, అంబికా సోనీ, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, పి.చిదంబరం, ఖర్గే వంటి సీనియర్లు పార్టీలో కీలకపాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక సింధియా, పైలట్ వంటి యువనేతలు పక్కకు తప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్, యువ నాయకత్వం మధ్య సమన్వయం పాటిస్తూ సోనియా గాంధీ కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశముందని ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. అలాగే యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న పాత మిత్రుల(రాజకీయ పార్టీల)ను కలుపుకుని వెళ్లడం, కొత్తవారిని ఆహ్వానించడం సోనియాగాంధీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర ఈఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పుంజుకునేలా చేయడం సోనియా ముందున్న ప్రధాన సవాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించడంతో పాటు గెలుపుగుర్రాలకు టికెట్ ఇవ్వడం సోనియా ముందున్న మరో సవాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సోనియా ఇటలీ మూలాలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకుని విమర్శలదాడికి దిగే అవకాశముందని కూడా ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment