
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాలూచీపడటం వల్లనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇంటర్ కుంభకోణాలకు నిరసనగా హిమాయత్ నగర్ ఏఐటీయూసీ నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల చొక్కాలతో సీపీఐ పార్టీ తలపెట్టిన నిరసన ర్యాలీను పోలీసులు ఏఐటీయూసీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అనేది ఓ మలుపు వంటిదని... ఏ రంగానైన ఎంచుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్ పాస్ అవ్వాలని అన్నారు. అటువంటి ప్రాధాన్యత ఉన్న ఇంటర్ విద్యలో బోర్డ్ తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయలేదన్నారు. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కోల్పోయారని నారాయణ పేర్కొన్నారు.
ఇంటర్ బోర్డ్ కుంభకోణం పై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టి ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరినా సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న సీపీఐ నాయకులతో పాటు నారాయణను కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment