
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో దినకరన్ మద్దతుదారులుగా ఉన్న 9 మంది నేతలపై ఆ పార్టీ వేటువేసింది. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులు పి.వెట్రివేల్, ఎన్జీ పార్దిబన్, ఎం.రంగసామి, తంగతమిళ్‌సెల్వన్, వీపీ కలైరాజన్, వి.ముత్తయ్య, పుగళెంది, అధికార ప్రతినిధులు నంచిల్ సంపత్, సీఆర్ సరస్వతీలను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అన్నాడీఎంకేకు ద్రోహం చేసినందుకే వీరిపై చర్య తీసుకున్నట్లు సీఎం పళనిస్వామి మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కవడం వల్లే దినకరన్ గెలిచారని ఆరోపించారు. దినకరన్‌ను రామాయణంలో ‘మాయలేడి’గా ఆయన అభివర్ణించారు. మరోవైపు తన మద్దతుదారుల్ని పార్టీ నుంచి తొలగించే అధికారం పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు లేదని దినకరన్ స్పష్టం చేశారు.