రైతులను మోసం చేయడం దుర్మార్గం | Gunnam Nagababu Fires On Tdp Leaders | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేయడం దుర్మార్గం

Published Thu, Mar 15 2018 11:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:30 PM

Gunnam Nagababu Fires On Tdp Leaders - Sakshi

వైఎస్సార్‌ సీపీ నాయకులు, నాగబాబు వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న మహిళ రైతులు

యలమంచిలి: రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే ప్రభుత్వం పరువు పోతుందని రైతుల చేత బలవంతంగా సాగు చేయించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, అధికారులు  ఇప్పుడు నీరివ్వకుండా ముఖం చాటేయడం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతేరు గ్రామంలో నీరందక ఎండిపోతున్న వరిచేలను బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తమ చొక్కాలను విప్పి పొలంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత, ప్రజాప్రతినిధులు, అధికారుల మోసపూరిత హామీలపై నిరసన తెలిపారు. పొలాలలో వరి దుబ్బులు పెకిలిస్తే దాయలుగా ఊడి రావడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తాను రైతుబిడ్డనని, వ్యవసాయం గురించి తనకంతా తెలుసు అని చెప్పుకునే ఎమ్మెల్యే నిమ్మలకు దాళ్వా పంటకు నీరు అందుతుందో లేదో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే పబ్లిసిటీ తగ్గించుకుని రైతుల సమస్యల పరిష్కారానికి  కృషి చేయాలని నాగబాబు హితవు పలికారు. నీటి సంఘ నాయకులు, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై తాను ఏ ప్రాంతంలోకి పొలాల పరిశీలనకు వెళుతున్నానో చెప్పి తాను వెళ్లి వచ్చిన తరువాత నీటిని విడుదల చేసే విధంగా వారితో మంతనాలు చేస్తున్నట్టు రైతులే చెప్పడం ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటానికి పరాకాష్టని విమర్శించారు. ఈ విధానంతో ఎమ్మెల్యే నిజస్వరూపం ఏమిటో రైతులకు అర్థమైందన్నారు. ఈ సమయంలో చేలకు నీరందకపోతే పండిన పంట పొల్లుగా తయారై దిగుబడిలో నష్టం వస్తుందని నాగబాబు ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు డ్రెయిన్ల నుంచి పంట చేలకు నీరు తోడుకునే దుస్థితి వచ్చిం దంటే అది ప్రభుత్వం చేతకానితనమని నాగబాబు విమర్శించారు. డ్రెయిన్లలో రొయ్యల చెరువుల నీరు వస్తుందని, ఆ నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రనష్టం కలగడమే కాకుండా భూసారం తగ్గి చేలు చౌడుబారే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా రైతుల ఆవేదన
నాగబాబును చూసి మహిళా రైతులు ఆయన వద్దకు వచ్చి వారి గోడును వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నీటి సంఘం నాయకులు, ఇరిగేషన్‌ అధికారులు ఒక రోజు రాత్రి సమయంలో వచ్చి అందరూ సాగు చేసుకోవాలని, ప్రతిఎకరాకూ నీరందిస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం దరిదాపుల్లోకి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలు ఖర్చుచేశామని, ఇప్పుడు చేనుకు నీరు పెట్టకపోతే పెట్టుబడి కూడా  రాదని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు, నాయకులు బోనం బులివెంకన్న, గుబ్బల వేణు, జక్కంశెట్టి సుభాష్‌చంద్రబోస్, వీరా ఉమాశంకర్, పాలపర్తి ఇమ్మానుయేలు, లంక చిరంజీవి, పోలుకొండ ఏలియా భక్తసింగ్, మోకా నరసింహారావు, దొంగ విజయ్‌కుమార్, కడలి రెడ్డియ్య, కల్యాణం గంగాధరరావు, చించినాడ జయశ్రీను, జక్కంశెట్టి ఆదినారాయణ, కోరాడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement