
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నేతలు శవ రాజకీయాలతో చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ సంస్మరణ సభను వేదికగా చేసుకుని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నల్లగొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అంతర్గత కలహాల్లో భాగంగానే శ్రీనివాస్ హత్య జరిగినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రావద్దనే కుట్రతోనే కోమటిరెడ్డి సోదరులు రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లోకి రాలేదని శ్రీనివాస్‌ను హత్య చేశారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కుంతియా, జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలు వేదికపైన ఉన్నప్పుడే టీఆర్‌ఎస్ పార్టీ నేతల శవాలను మోరీల్లో పడేస్తాం...బట్టలు ఊడతీసి కొడతాం అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు నల్లగొండకు రావాలంటే భయపడింది జానా, ఉత్తమ్‌లు కాదా? అని మంత్రి ప్రశ్నించారు.
ఇక్కడ మంత్రులుగా ఒక్క శిలాఫలకం వేశారా? గతంలో జానారెడ్డి, ఉత్తమ్ అనుచరులపైన కోమటిరెడ్డి దాడులు చేయలేదా? ఉత్తమ్‌ను, కుంతియాను దూషించినది వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. ఈ ఘటనలన్నింటిని విస్మరించి కాంగ్రెస్ నేతలంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. శ్రీనివాస్ హత్య కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment