
ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు ప్రాక్టీస్ చేస్తున్న మహిళల వీడియో క్లిప్పింగ్
కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన మహిళా కార్యకర్తలు చేసిన ఓవరాక్షన్ బెడిసికొట్టింది. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఓ మహిళ రెండో మహిళను ‘ఊ.. స్టార్ట్ చెయ్యి.. మొదలుపెట్టు’ అనగా ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఆ మహిళ భుజాలపై వాలిపోయి ఏడవడం కనిపించింది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని విమర్శించాలని, వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలనే ఉద్దేశంతో ఆ మహిళలు తయారు చేసుకున్న వీడియోలో ఆరంభంలో ఉన్న ఆ రెండు పదాలు కూడా రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియాలో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఓ పథకం ప్రకారం వీడియోలు తీసి, వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయాలన్న జనసేన నేతల దురాలోచన బట్టబయలైంది. ఈ వీడియోలో ఉన్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై తోటి జనసేన కార్యకర్తలతో కలిసి దాడి చేసి కొట్టిన వీడియో కూడా బయటకు వచ్చింది. అది జరిగిన 48 గంటల తర్వాత మంగళవారం సదరు మహిళ చేతికి కట్టు కట్టుకుని పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడం, ఆయన పరామర్శించడాన్ని చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు.