
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేయకుంటే మంచిదని హితవు పలికారు. నట్టి కుమార్ 1981 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అయితే ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందం నచ్చక కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను ఢీ కొట్టడానికి చంద్రబాబు పథకం ప్రకారం అటు పవన్ కల్యాణ్‌ను, ఇటు కేఏ పాల్‌ను రంగంలోకి తెచ్చారన్నారు. ‘‘చంద్రబాబు చాలా ప్లాన్డ్. ఆయన ప్లాన్‌లకు ఎవరూ తట్టుకోలేరు. ఇటు క్రిస్టియన్ ఓట్ల ను చీల్చడానికి కేఏ పాల్‌ను తీసుకొచ్చారు. అయినప్పటికీ జగన్ ఒక్కడే ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రజలంతా ఈ విషయం ఆలోచించాలి’’అని కోరారు. ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాబోయేది జగన్‌నేనని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లంతా వన్‌సైడే ఉన్నారన్నారు.