
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధించడంలో ఎంపీలు విఫలమయ్యారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయడంలో వాళ్లెందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు. తమ నిజనిర్ధారణ కమిటీ నివేదికను నాలుగైదు రోజుల్లో బయటపెడతామని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని అయోమయంలోకి నెట్టిన నేపథ్యంలో స్పష్టత కోసం చేసిన ప్రయత్నమే ఈ సమావేశమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) సమావేశం శనివారం ముగిసింది. అనంతరం మీడియాను ఉద్దేశించి పవన్ కల్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడారు.